Free Gas Cylinders Scheme (Photo Credit : Google)
Free Gas Cylinders Scheme : రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఎన్డీయే కూటమి ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని.. మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం అంగలకుదురులో పల్లె పండగ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల.
ప్రతి మహిళకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఈ నెల 23న క్యాబినెట్ లో ఆమోదం జరిగిన తర్వాత ఈ స్కీమ్ విధివిధానాలు వెల్లడిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
‘ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో విధివిధానాలు ఖరారు చేసుకుని 23వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు 3వేల కోట్ల రూపాయలు ప్రతీ సంవత్సరం సబ్సిడీ రూపంలో దీపావళి పండగ సందర్భంగా ప్రతీ ఇంట్లో సంతోషం నింపే విధంగా ప్రతీ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలనే తపనతో మేము చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 9 లక్షల 60వేల మందికే. కానీ, రాష్ట్రంలో ఉన్న తెల్లకార్డులు సుమారు కోటి 40 లక్షలు ఉన్నాయి. అందులో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ గ్యాస్ సిలిండర్ అందే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేమందరం కూడా సిద్ధమయ్యాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Also Read : ఏపీలోకి వచ్చి కాల్పులు జరిపిన తెలంగాణ పోలీసులు.. అసలేం జరిగిందంటే..