శ్రీ సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం.. ఉలిక్కిపడిన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..
సమాచారం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ, పోలీసులు వెంటనే రామాపురం గ్రామానికి చేరుకుని విచారిస్తున్నారు.

Gun Firing In Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో తుపాకుల మోత కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలోని రామాపురం గ్రామం బస్టాండ్ సమీపంలో తుపాకుల మోతతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీహార్ కు చెందిన దొంగల ముఠా గ్రామంలో సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కు చెందిన దొంగల ముఠాను వెంబడిస్తూ తెలంగాణ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బీహార్ దొంగల ముఠా బైక్ పై పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ, పోలీసులు వెంటనే రామాపురం గ్రామానికి చేరుకుని విచారిస్తున్నారు.
బత్తలపల్లి మండలం రామాపురం వద్ద బీహార్ కు చెందిన ఐదుగురు సభ్యుల దొంగల ముఠా.. అక్కడ రూమ్ తీసుకుని రెండేళ్లుగా ఉంటున్నారు. అక్కడే ఉంటూ దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల దొంగతనాలు చేశారు. తెలంగాణలో చోరీలు చేసి ఏపీలో తలదాచుకుంటున్నారు. బీహార్ దొంగల ముఠా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం రామాపురంలో ఉంటున్నట్లు గుర్తించిన తెలంగాణ పోలీసులు.. నిన్న రాత్రే అక్కడికి చేరుకున్నారు.
ఈ ఉదయం 7 గంటల సమయంలో బీహార్ దొంగలు ఉంటున్న రూమ్ దగ్గరికి పోలీసులు వెళ్లారు. పోలీసులను గమనించిన దొంగలు.. వారిపై దాడికి యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగల ముఠా, పోలీసుల మధ్య కాల్పుల వ్యవహారం గ్రామంలో కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియక గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
కాగా, తెలంగాణ పోలీసులు ఏపీకి వచ్చినప్పుడు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి సాయం తీసుకోవాలి. కానీ, తెలంగాణ పోలీసులు అలా చేయలేదు. డైరెక్ట్ గా వచ్చి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని ధర్మవరం డీఎస్పీ, పోలీసులు స్పాట్ కి చేరుకునే లోపే.. అటు దొంగల ముఠా, ఇటు తెలంగాణ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read : తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో మోసం..! వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు..