తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో మోసం..! వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు..
జకియా సహా చంద్రశేఖర్, పీఏ కృష్ణలపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.

Case On Ysrcp Mlc Zakia Khanam (Photo Credit : Google)
Ysrcp Mlc Zakia Khanam : తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ జకియాపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు, వేదాశీర్వచనం టికెట్లు రూ.65వేలకు విక్రయించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్నారని ఓ భక్తుడు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జకియా సహా చంద్రశేఖర్, పీఏ కృష్ణలపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ లో విక్రయించారన్న ఆరోపణల మీద ఎమ్మెల్సీ జకియా ఖానం మీద తిరుమలలో కేసు నమోదైంది. విజిలెన్స్ అధికారులు ఆమె మీద ఫిర్యాదు చేశారు. జకియా ఖానం సిఫార్సు లేఖల మీద 6 బ్రేక్ దర్శనం టికెట్లు, ఒక వేద ఆశీర్వచనం టికెట్ ని పొంది వాటిని బ్లాక్ లో విక్రయించారని ఫిర్యాదు చేశారు. బెంగళూరుకి చెందిన శశికుమార్ అనే భక్తుడికి వీరు విక్రయించారు. ఆయన విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక జకియాతో పాటు మరో ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు.
కాగా, జకియా త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమెపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎలా జరిగింది? సిఫార్సు లేఖలు జకియానే ఇచ్చారా? లేక పీఏ ఇచ్చాడా? అన్ని కోణాల్లో పోలీసులు సమగ్రంగా దర్యాఫ్తు చేస్తున్నారు.
గతంలో కూడా ప్రజాప్రతినిధులకు చెందిన సిఫార్సు లేఖలపై పలువురు వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందడం, వాటిని బ్లాక్ లో అమ్ముకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో ఇలానే జరిగింది. వీరందరికి బ్రేక్ దర్శనానికి సిఫార్సు లెటర్లు కేటాయిస్తారు. ఒక్కోసారి అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. స్వయంగా వాళ్లే తీసుకోవచ్చు లేదంటే దళారీల ద్వారా తీసుకోవచ్చు.
ఎప్పటి నుంచో దుర్వినియోగం అవుతున్నాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక జకియా ఖానం ఇటీవలి కాలంలో సిఫార్సు లేఖలు ఇవ్వడం, వాటిని బ్రేక్ దర్శనాలకు అప్లయ్ చేసుకోవడం.. ఈ రకంగా అక్రమాలకు పాల్పడటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆమెపై తిరుమల పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఒక ఎమ్మెల్సీ.. బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ లో విక్రయించారనే ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్..!