శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్..!
తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.

Swaroopanandendra Saraswati : విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల స్థలానికి అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అధికారంలోకి వచ్చాక ఈ భూములపై దర్యాఫ్తు చేపట్టంది కూటమి సర్కార్. తాజాగా వీటిపై నివేదిక రావడంతో శారదా పీఠానికి కేటాయించిన స్థలాల అనుమతులను రద్దు చేస్తూ స్వరూపానందేంద్రకు ఝలక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్.
విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ 220 కోట్ల రూపాయలు. కాగా, కేవలం 15 లక్షల రూపాయల నామమాత్రపు ధరకు శారదాపీఠానికి గత ప్రభుత్వం ధారదత్తం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటే తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.
అసలేం జరిగిందంటే..
గత ప్రభుత్వంలో చాలా చౌకగా శారదా పీఠానికి కేటాయించిన భూములపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. దీని లావాదేవీలపై అధికారులతో విచారణ జరిపించి ప్రభుత్వం.. నివేదికకు అనుగుణంగా ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. శారదాపీఠం కార్యకలాపాల విస్తరణ, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు భూమి కేటాయించాలని పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గత జగన్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఈ మేరకు భీమిలి మండలం కొత్తవలసలో సర్వే నెంబర్ 102/2లో 7.7 ఎకరాలు, 103.2లో 7.3 ఎకరాలు.. మొత్తం 15 ఎకరాల భూములను కేటాయించారు. ఆ సమయంలో ధర నిర్ణయించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి కలెక్టర్ ను కోరగా.. రిజిస్ట్రేషన్ విలువ పరిగణలోకి తీసుకుని ఎకరాకు 1.8 కోట్ల రూపాయలకు ఇవ్వొచ్చని సిఫార్సు చేశారు. దాని ప్రకారం ప్రభుత్వానికి శారదాపీఠం సుమారు 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జగన్ సర్కార్ ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేసింది. అంటే, 15 ఎకరాలను రూ.15 లక్షలకే ఇచ్చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్ లో గల భూములు ఎంతో విలువైవని, కొత్తవలసలో ఎకరం ధర బహిరంగ మార్కెట్ లో 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉంది. ఆ లెక్కన శారదాపీఠానికి ఇచ్చిన భూముల విలువ చూసుకుంటే 250 కోట్ల నుంచి 350 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత విలువైన భూములను శారదాపీఠానికి కారు చౌకగా ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలువురు కోర్టును సైతం ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చాక 15 ఎకరాల వ్యవహారంలో నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కొత్తవలసలో శారదాపీఠానికి కేటాయించిన భూమికి రిజిస్ట్రేషన్ విలువ ఎంత? ప్రభుత్వం ఎంతకు కేటాయించింది? తదితర వివరాలు అడిగింది. ఈ మేరకు యంత్రాంగం సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను పరిశీలించిన కూటమి సర్కార్.. శారదాపీఠానికి భూముల కేటాయింపులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం.. టార్గెట్ మూడేళ్లు..