రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం.. టార్గెట్ మూడేళ్లు..
మొన్ననే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Capital Amaravati (Photo Credit : Google)
Capital Amaravati : రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో గతంలో సీఆర్డీయే కార్యాలయ పనులు చేపట్టారు. ఆ పనులను సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. సీఆర్డీయే ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. రాజధాని అమరావతి పనులు వేగవంతం కానున్నాయి. కేంద్రం కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సీఆర్డీయే ప్రాజెక్ట్ ఆఫీస్.. 8 ఫ్లోర్ లతో ఈ కార్యాలయం ఉంటుంది. రూ.160 కోట్లతో నాడు టీడీపీ ప్రభుత్వం హయాంలోనే 2017లో ఈ ఆఫీస్ పనులు ప్రారంభించారు. 3.62 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల 42వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం రూపుదిద్దుకుంది. భవన నిర్మాణ కోసం రూ.61 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయి. ఆర్కిటెక్ట్, ఫినిషింగ్, ఇంటీరియర్, ఎలక్ట్రిక్, మెకానికల్, ఇతర వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనుల కోసం టెండర్లు పిలిచారు. కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించారు.
ఇవాళ సీఎం చంద్రబాబు పనులకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి శరవేగంగా పనులు జరగనున్నాయి. మూడు నెలల్లో ఈ బిల్డింగ్ ను పూర్తి చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ శాఖ సంబంధ అనుబంధ ఆఫీసులన్నీ మూడు నెలల్లో ఇక్కడికి రాబోతున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇక్కడి నుంచే పని చేసుకోబోతున్నారు. ప్రస్తుతం సీఆర్డీఏ ఆఫీస్ విజయవాడలో ఉంది. దాన్ని 3 నెలల్లో ఇక్కడికి తీసుకురాబోతున్నారు. దాంతో పాటు మున్సిపల్ అనుబంధ ఆఫీసులన్నీ ఇక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
మొన్ననే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ బిల్డింగే కాకుండా రాజధాని ప్రాంతంలో మరిన్ని నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మొదలైన నిర్మాణ పనులు 80శాతం వరకు పూర్తయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు నివాస గృహాలను కూడా వీలైనంత తొందరలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి కల్లా టెండర్లు పిలిచే పనులన్నీ పూర్తి కానున్నాయి. అప్పటి నుంచి అమరావతి నిర్మాణం శరవేగంగా పూర్తి కానుంది. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు సర్కార్ ముందుకెళ్తోంది.
Also Read : వైసీపీ చేసిన తప్పులు చేయొద్దు, ఇష్టమొచ్చినట్లు అరెస్టులు జరగాలంటే కుదరదు- సీఎం చంద్రబాబు