వైసీపీ చేసిన తప్పులు చేయొద్దు, ఇష్టమొచ్చినట్లు అరెస్టులు జరగాలంటే కుదరదు- టీడీపీ ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు
నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, ఈ విధానం మంచిది కాదు.

Cm Chandrababu Naidu : వైసీపీ ఐదేళ్ల అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బలయ్యారని సీఎం చంద్రబాబు వాపోయారు. ఎన్నికల్లో ఎన్డీయేను ప్రజలు విశ్వసించారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు చంద్రబాబు. వైసీపీ చేసిన తప్పులు మీరు చేయొద్దని ఎమ్మెల్యేలను హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లిక్కర్ వ్యాపారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు. మద్యం వ్యాపారంలో సంపాదించాలని అనుకోవద్దన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
”ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ప్రజల ఆశీర్వాదంతో పాటు కార్యకర్తల త్యాగాల వల్ల మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నాం. ఎంతమంది ఎమ్మెల్యేలం ఉన్నామనే దానికంటే ఎంత క్రమశిక్షణగా ఉన్నామనేది ముఖ్యం. ఎంపీలను ఎమ్మెల్యేలు గౌరవించాలి. ఎమ్మెల్యేలను ఎంపీలు కలుపుకుని పోవాలి. కొంతమంది ఎమ్మెల్యేలు క్యాడర్ ను పట్టించుకోవడం లేదు.
నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, ఈ విధానం మంచిది కాదు. ఏ నేత కూడా పార్టీ, క్యాడర్ లేకుండా గెలవలేరు. తప్పు చేసిన వాళ్లను చట్టబద్ధంగా శిక్షిద్దాం. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలంటే కుదరదు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం నా విధానం కాదు. 2029లో మళ్లీ మీ అందరినీ గెలిపించుకోవాలని చూస్తున్నా. మీ పని తీరు కూడా బాగుండాలి. ప్రజల వినతులు పరిష్కరించడంపై ఎమ్మెల్యేలు శ్రద్ధ చూపాలి. పట్టభద్రుల ఓట్ల నమోదులో పార్టీ నేతలు పాల్గొనాలి. ఓట్ల నమోదుకు ఇంకా 19 రోజుల సమయం మాత్రమే ఉంది” అని చంద్రబాబు అన్నారు.
Also Read : జమిలి ఎన్నికల నిర్వహణ ఎవరి చేతుల్లోనూ లేదు: జగన్