New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన..

ఈ కేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని తెలిపారు.

Nadendla Manohar

New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే నెలలోపు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. దీపం-2 పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ కింద ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు దీపం పథకానికి అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

ఈ కేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని తెలిపారు. 2వేల 900 కోట్ల రూపాయలతో దీపం-2 పథకం కింద సిలిండర్లను అందజేస్తామన్నారు. 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేశామన్నారు. 74 వేల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు మూర్ఖులని ఆయన అన్నారు. సచివాలయంలో అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Also Read : ఎలా జరిగింది..? సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు కీలక ఆదేశాలు

కొత్త రేషన్ కార్డులపై ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏటీఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామన్నారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుందని, ఆ వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు.

క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. ఈ కేవైసీ పూర్తయ్యాకే ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల అన్నారు.

”కొత్త రేషన్ కార్డుని ఇకపై రైస్ కార్డ్ అని పిలుస్తారు. ఈ కార్డు ఏటీఎం కార్డ్ సైజులో ఉంది. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అది సేఫ్టీ ఫీచర్. ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ ఉంటాయి. గతంలో కన్నా చాలా క్లియర్ గా అక్షరాలు ఉంటాయి. గతంలో రేషన్ కార్డ్ పెద్దదిగా ఉన్నా అందులో పేర్లు, వివరాలు ఏవీ స్పష్టంగా కనిపించేవి కాదు. ఇందులో అలా కాదు. చాలా క్లియర్ గా వివరాలు కనిపించేలా ఏర్పాట్లు చేశాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.