Nadendla Manohar: బాధ్యత లేని నాయకుడు, రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు- జగన్ పై మంత్రి నాదెండ్ల ఫైర్

అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.. మీకంటే ఎక్కువ బటన్ లు నొక్కుతారని కాదని మంత్ని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Nadendla Manohar

Nadendla Manohar: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్ కనీస అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చేది ఐదేళ్లకే అని మర్చిపోయారా..? అంటూ జగన్ ని నిలదీశారు. ఐదేళ్ల పాలనలో కనీసం గుంతలు కూడా పూడ్చలేని జగన్ ఈరోజు పాలన గురించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

మద్యపాన నిషేధం అని మీరిచ్చిన హామీ ఎందుకు అమలు చెయ్యలేదు..? అని జగన్ ని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.. మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతారని కాదని జగన్ ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పర్యటనలు, పరామర్శల పేరుతో జగన్ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని జగన్ ను డిమాండ్ చేశారు. ప్రజలకు జగన్ పాలన నచ్చకనే కదా 11 సీట్లకు పరిమితం చేశారు అని మంత్రి నాదెండ్ల అన్నారు.

”ఒక బాధ్యత లేని నాయకుడు జగన్. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. జగన్ తీరు చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడో తేడా ఉంది. నా ప్రెస్ మీట్ చూశాకైనా జగన్ తన జ్ఞానాన్ని పెంచుకుంటారని, అర్థం చేసుకుంటారనేది నా ప్రయత్నం. వాళ్ల లాగా యాంటీ సోషల్ గానో, వయలంట్ గానో రియాక్ట్ అవ్వాలని కోరుకునే వాళ్లం కాదు. ప్రజలు అధికారం ఇచ్చేది ఐదేళ్లకే అనేది జగన్ మర్చిపోయారేమో. తన ఐదేళ్ల పాలనలో కనీసం గుంతలు కూడా పూడ్చలేని జగన్.. ఇవాళ ఎన్నికల వాగ్దానాల గురించి, పరిపాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

”దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ నాలుగు నెలలకోసారి అందిస్తున్నాం. మొదటి విడతలో 97 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించాం. రూ.846 కోట్లు ఖర్చు చేశాం. రెండవ విడతలో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించాం. రూ.712 కోట్లు ఖర్చు చేశాం. రైతుల గురించి మాట్లాడే జగన్ 1600 కోట్లు ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్లిపోయారు? జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకం చూపించారు. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు” అని ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టులో చుక్కెదురు.. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులకు కీలక ఆదేశాలు