Rajya Sabha : రాజ్యసభ టికెట్లపై టీడీపీ నేతల్లో టెన్షన్.. చంద్రబాబు చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు!
Rajya Sabha Race : రాజ్యసభ టీడీపీ ఆశవాహుల్లో టెన్షన్ మొదలైంది. రాజ్య సభ సీటు కోసం సచివాలయానికి నేతలంతా క్యూ కట్టేస్తున్నారు. చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ సేవలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
Rajya Sabha Race
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ టీడీపీ ఆశావాహుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అతి త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న వేళ సీట్ల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో రాజ్యసభ సీటు కోసం టీడీపీ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ టికెట్ కోసం టీడీపీ నేతలు గట్టిగానే పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ నేతలంతా ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
తమకు ఎలాగైన రాజ్యసభ సీటుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో రాష్ట్ర సచివాలయం, పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసేందుకు క్యూ కడుతున్నారు. తాము పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారో ఎన్ని సేవలు చేశారు? రాజకీయ అనుభవాల గురించి వివరించే పనిలో పడ్డారు.
రేసులో ఉన్న నేతలు వీరేనా? :
అయితే, ఈ క్రమంలో రాజ్యసభ రేసులో రాష్ట్రంలోని పలువురు ప్రముఖ టీడీపీ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో కిలారు రాజేష్, సానా సతీష్, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు పార్టీకి ఆర్థికంగానూ మరికొందరు రాజకీయంగా చేసిన సేవలను అధిష్ఠానం ముందు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులోనూ సామాజిక సమీకరణాలు సైతం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారాయి. ముఖ్యంగా ఎస్సీ కోటాలో సీనియర్ నేత వర్ల రామయ్య పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాధాన్యం వహించే చింతకాయల విజయ్‌కు బీసీ కోటాలో అవకాశం లభించే ఛాన్స్ ఉందంటూ చర్చ నడుస్తోంది. ఇక రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ వర్గం నుంచి మాత్రం తిప్పేస్వామి కూడా రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Read Also : CM Chandrababu Naidu : తెలంగాణలో పవన్ సభను అడ్డుకుంటారా? చంద్రబాబు సంచలన కామెంట్స్!
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొత్త ముఖాలకు కూడా ఈసారి రాజ్యసభలో సీటు దక్కుతుందనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈసారి మహిళలకు ఛాన్స్? :
అసలు ఇప్పటివరకు పెద్దగా చర్చలో లేని కొందరి పేర్లు కూడా చివరి నిమిషంలో తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందని టీడీపీ శ్రేణుల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మహిళలకు ప్రాధాన్యం వహించేలా ఒక మహిళకు రాజ్యసభ అవకాశం కల్పించే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జనసేనకు ఒక సీటుపై క్లారిటీ? :
అదేవిధంగా, ఎన్డీఏ కూటమి సమీకరణాలు సైతం ఈసారి రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీటు కేటాయించే అంశంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు అవకాశమిస్తే.. ఆ పార్టీ తరఫున లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లేనన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఈ నెల 8వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. గురువారం (జూన్ 4న) జరగనున్న ఎన్డీఏ సమావేశంలో మిత్రపక్షాలకు కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. దాంతో టీడీపీ ఆశావాహులు, జనసేన నేతలు, పార్టీ శ్రేణులు సైతం ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్యసభ టికెట్లపై టీడీపీ తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
