WhatsApp Governance: వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ ఇదే.. ప్రారంభించిన మంత్రి లోకేశ్.. ఇకనుంచి ఉన్నచోటుకే 161 సేవలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ ను ప్రకటించారు.

Nara Lokesh

WhatsApp Governance: ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. దేశంలోని తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. మొదటి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎప్, మున్సిపల్ శాఖలలోని 161 సేవలను వాట్సప్ ద్వారా అందించనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ఈ సేవలను ప్రారంభించారు. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ ను ప్రకటించారు. 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ సేవల కోసం కేటాయించింది. ఆ ఎకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఈ వాట్సప్ నెంబర్ ద్వారా ప్రజలు వివిధ రకాల సర్టిఫికెట్లు, ధృవపత్రాలను పొందడంతోపాటు.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.

Also Read: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. నేడే ప్రారంభం.. ఏంటిది? ఎలా పనిచేస్తుంది? ఏమేం సేవలు అందిస్తారు?.. ఫుల్ డిటెయిల్స్..

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి వచ్చాయని, రెండో విడతలో 360 సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. మాది ప్రజాప్రభుత్వం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది ప్రజలను కలిశాను. గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ, ఆ పరిస్థితిని తొలగించి మన వద్దకే అన్నిసేవలు వచ్చేలా చర్యలు చేపట్టాం. ప్రస్తుతం వాట్సప్ అందరూ వాడే ఫోన్ అప్లికేషన్.. ప్రభుత్వం కేటాయించిన వాట్సాప్ నవంబర్ కు మెసేజ్ చేస్తే వెంటనే మీకు కావాల్సిన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

 

ఈ తరహా సేవలు ప్రపంచంలోనే తొలిసారి అని గర్వంగా చెప్పగలనని లోకేశ్ అన్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఒకేసారి వాడకం వల్ల రెండురోజులు సర్వర్ సమస్యలు తలెత్తొచ్చు.. లోడ్ కు తగ్గట్టుగా సర్వర్ల పెంపు వంటి చర్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. కొన్ని సేవలు అందుబాటులోకి తేవాలంటే చట్ట సవరణలు అవసరం. ప్రస్తుతం మొదటి విడతలో 161 సేవలను అందుబాటులోకి తెచ్చాం. మలిదశ సేవలకు అనుగుణంగా ప్రభుత్వం చట్టసవరణలు కూడా చేస్తుంది. 80శాతం సేవలు సెకన్ల వ్యవధిలోనే అందేలా చూస్తున్నామని లోకేశ్ తెలిపారు.

ఒప్పందం చేసుకున్న మూడు నెలల తొమ్మిది రోజుల్లో తొలిదశ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ ఈ సేవలు ఉంటాయి. ముందు 520 సేవలు అందించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తరువాత ఫిర్యాదులు స్వీకరణ వంటి ఆలోచనలు పరిశీలిస్తామని లోకేశ్ చెప్పారు.