Payyavula Keshav: సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలే నిదర్శనం అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. జగన్ పై ఆయన ఎదురుదాడికి దిగారు. ఓట్లు, ప్రజాస్వామ్యం అంటూ.. జగన్ నుండి కొత్త కొత్త పదాలు వింటున్నాం అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా కేవలం 3 మీడియా సమావేశాలు పెట్టిన జగన్.. నేడు రోజుకు గంటన్నర పాటు ప్రెస్ మీట్ పెడుతున్నారని అన్నారు. కడప జిల్లాలో 79శాతం జెడ్పీటీసీలు, 76శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం చేసుకున్న మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటారా? అని జగన్ ను ప్రశ్నించారు.
”ఈ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మీరు నియమించిన వ్యక్తే కదా? అయినా నమ్మకం లేదా? తల్లిని చెల్లిని కూడా మీరు నమ్మరు. ఈ విషయం మీ క్యాడర్, లీడర్ అయినా తెలుసుకోవాలి. 30 సంవత్సరాల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి. 11 మంది నామినేషన్లు వేశారంటేనే ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా జరుగుతాయనే నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. పోలింగ్ భూత్ లలో ఏజెంట్లే లేరని ఎలా మాట్లాడతారు? 11 మంది అభ్యర్ధుల ఏజెంట్లు ఉన్నప్పుడు.. మీ ఏజెంట్లు ఎందుకు వెళ్లిపోయారు.. మీరే చెప్పారు ఏజెంట్ పై దాడి చేశారని అంటే వారు ఉన్నట్టే కదా?
నిజానికి మీ ఏజెంట్లు రిగ్గింగ్ చేయాలనుకుంటే వారు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నికల రిజల్ట్ కళ్లకు కనపడుతుంటే మీరు ఓటమికి కారణాలు వెతుక్కున్నట్టు ఉంది మీ ధోరణి. రాజా ఆఫ్ కరెప్షన్ కాదు ఈసారి రాజా ఆప్ ప్రస్ట్రేషన్ అని వేయాల్సి ఉంటుంది పుస్తకాలు. స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగినప్పడు గ్రామాల్లో ఉద్రిక్తతలు ఉంటాయి. అవి కొత్త కాదు. పోలీసులు ఇరువర్గాల వారిని నియంత్రణ చేస్తారు. అవినాశ్ రెడ్డిని తీసుకెళితే ఏదో జరిగింది అంటారు.(Payyavula Keshav)
ఒకప్పుడు సీబీఐ అవినాశ్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది. నేడు ఓ కానిస్టేబుల్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం. మీరు పోలీసుల యూనిఫామ్ ల గౌరవాన్ని తీసేశారు. కేంద్రానికి స్పెషల్ రిపోర్టులు పంపారు. కర్నూలు జిల్లాలో అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేం అన్నారు. గతంలో మీ ఒత్తిళ్లు పని చేశాయి. కనుక నాడు వ్యవస్ధ పని చేయలేదు. డెమాక్రసీ మీద మీరు మీ ఎమ్మెల్యేలు ట్రైనింగ్ సెషన్లకు రావాలి.
పులివెందులలో ఇంత స్వేచ్చగా ఎన్నికలు జరిగినందుకు పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు మీరు అక్కడ జనాల్లో పెట్టిన భయం ఇప్పుడు పోయింది. ఆ భయం మీకు మొదలైంది. దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్ ఎందుకు మాట్లాడడం లేదు అని అంటున్నారు. అసలు ఈ దొంగ ఓట్ల వ్యవహారం మీరు ఉరవకొండ నుండి మొదలెట్టారు. విశాఖపట్నం, తిరుపతి, పర్చూరు మర్చిపోయారా? మేం ప్రజలను నమ్ముకున్నాం. దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకోలేదు. ఈ విషయంలో మీరే రాహుల్ గాంధీకి హాట్ లైన్ లో చెప్పి నేర్పించినట్టు ఉన్నారు. కేంద్రంలో ఎన్డీయేలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నాం.
రేవంత్ రెడ్డి ఒకప్పుడు మా పార్టీ మెంబర్. మీకు కేసీఆర్ మధ్య సంబంధాలు ఏమైపోయాయి? గిప్ట్ లు రిటర్న్ గిప్టులు ఏమైపోయాయి? చంద్రబాబు ఇప్పుడు వెరీ టాల్ లీడర్. జాతీయ స్ధాయిలో గొప్ప లీడర్. మరో పదేళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు. అసలు మీరు వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు అర్హులుగా ఉంటారో లేదో చూసుకోండి” అని జగన్ ను ఉద్దేశించి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
Also Read: పులివెందులలో ఈసారి తన అరాచకాలకు తావు లేదనే జగన్ అసహనం.. ప్రజలు ధైర్యంగా ఓటేశారు- సీఎం చంద్రబాబు