Minister Perni Nani Press Meet : ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహధ్దుల దాక వస్తే..అక్కడి నుంచి గమ్యస్థానాలకు తీసుకెళుతామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు తిప్పడంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా ఫలించడం లేదు.
ఈ తరుణంలో హైదరాబాద్ లో 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. దసరా పండుగకు ఆర్టీసీ బస్సులు తిప్పాలని అనుకున్నా..నెరవేరడం లేదన్నారు. దసరా పండుగ వరకైనా చెరో వంద బస్సులు తిప్పుదామని కోరామని, మంగళవారం తుది ప్రతిపాదనలు పంపుతామన్నారు.
మూడు రోజులు సెలవు దినాలు కావడం కూడా..ఒక కారణమన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారు..సరిహద్దుల వరకు వస్తే..అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా..వారి గమ్యస్థానానికి తీసుకెళుతామన్నారు. జూన్ 18వ తేదీ నుంచి టీఎస్ ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠినంగా ఉండాలని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వర్షాలకు రోడ్లపై గుంతలు పడడం సహజమని, రోడ్ల మరమ్మత్తుల కోసం సీఎం జగన్ రూ. 2500 కోట్లు మంజూరు చేశారన్నారు. వర్షాలు తగ్గాక పనులు ప్రారంభిస్తామన్నారు.