Pawan Kalyan Sidiri Applaraju
Pawan Kalyan : ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్షాన్ని పిలవాలని పవన్ డిమాండ్ చేశారు. అఖిలపక్షం వేస్తే స్టీల్ ప్లాంట్ కోసం తాను పోరాడతానని చెప్పారు. అంతేకాదు సర్కార్ కి డెడ్ లైన్ కూడా పెట్టారు. దీనికి అధికార పార్టీ నేతలు, మంత్రులు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ విమర్శలను తిప్పికొడుతున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తున్న వారికి జనసేనాని పవన్ కల్యాణ్ సంఘీభావాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న వైజాగ్ వెళ్లిన పవన్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ, వైసీపీపై మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని… వారం రోజులు టైమ్ ఇస్తున్నానని అన్నారు. ఆ తర్వాత మీకు గడ్డుకాలమేనని వైసీపీని హెచ్చరించారు.
Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందా?..
ఈ నేపథ్యంలో పవన్ పై ఏపీ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఇన్ని రోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని… అలాంటప్పుడు బీజేపీని ప్రశ్నించాలని అన్నారు.
బీజేపీని పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనడం లేదని అప్పలరాజు విమర్శించారు. వ్రైవేటీకరణ అంశంలో వైసీపీకి సంబంధం లేకపోయినా తమ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న బీజేపీకి తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో పవన్ ఎలా మద్దతిచ్చారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.
Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..
”స్టీల్ ప్లాంట్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం పవన్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఇన్ని రోజులు పవన్ ఎక్కడికి వెళ్లారు? తన రాజకీయ లబ్ది కోసం పవన్ సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్. అఖిలపక్షం వేస్తే పోరాడతానని ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించడం ఏంటి? అసలు మాకు టైమ్ విధించడానికి పవన్ ఎవరు?” అని మంద్రి అప్పలరాజు నిలదీశారు.