Bojjala Sudhir Reddy: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంఛార్జ్ కోట వినుత దంపతులు చేసిన ఆరోపణలు, డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. కోట వినుత దంపతులు చెత్త, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరినీ వదలను అని వార్నింగ్ ఇచ్చారు. ఇక రాయుడు వీడియోపైనా ఎమ్మెల్యే బొజ్జల పలు అనుమాలు వ్యక్తం చేశారు. అది ఏఐ వీడియోనా? మార్ఫింగ్ చేసిన వీడియోనా? అనే అనుమానం కలుగుతోందన్నారు. లేక డ్రైవర్ రాయుడిని బెదిరించి ఆ వీడియో తీశారా అన్న సందేహం వ్యక్తం చేశారు. డ్రైవర్ రాయుడు బతికుంటే విచారణలో నిజం తేలేదన్నారు.
”కోట వినుత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టను. డ్రైవర్ రాయుడు వీడియో ఎవరు రిలీజ్ చేశారో విచారణలో తేలుతుంది. కోట వినుత దంపతులు డ్రైవర్ ను హత్య చేశారని అందరితో పాటే నాకూ తెలిసింది. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని వినుత గురించి నేనెందుకు లక్షలు ఖర్చు చేస్తాను?
ఈ వ్యవహారంపై లోతైన దర్యాఫ్తు జరగాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. నేను రెండు విషయాలు అడగాలని అనుకుంటున్నా.. ఇది ఏఐ వీడియోనా? లేదా మార్ఫింగ్ చేసినదా? రాయుడు ఎవరో నాకు తెలీదు. డ్రైవర్ ను బెదిరించి ఈ వీడియో తీశారా? డ్రైవర్ రాయుడు బతికుంటే విచారణలో తేలేది” అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.
”రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలి. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే. కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నాకు రాయుడు తెలియదు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాను. న్యాయవాదులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రైవర్ వీడియో నమ్మేలా లేదు. చంపడానికి ముందు బెదిరించి రికార్డు చేసి ఉంటారు. ఈ ఎపిసోడ్ పై పార్టీ అధిష్టానానికి వివరిస్తాను. మా కుటుంబం 45 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు మేం ప్రజల్లో ఉన్నాం. నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి, మాకు మంచి పేరు ఉంది.
2019 లో జనసేన పార్టీ నుంచి కోట వినుత పోటీ చేసి డిపాజిట్ కూడా రాలేదు. ఆరోజు మాకు 70 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2024లో కూటమి ప్రభుత్వం తరపున టికెట్ నాకు వచ్చింది. కష్టపడి పని చేశాం. ప్రధాని మోదీ, అందరి ఆశీస్సుల వల్ల మంచి మెజారిటీతో గెలిచాం. ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా కాళహస్తిలో పరిస్థితులు మారాయి. కోట వినుత దంపతులు వాళ్ళ డ్రైవర్ ను హత్య చేశారు. నిన్న నాలుగు గంటలకు నాకు ఒక వీడియో వచ్చింది. హత్య చేయబడ్డ డ్రైవర్ రాయుడు వీడియో అది. ఈ వీడియో ఏఐ చేసినదా? లేక చంపడానికి ముందు వీడియో తీసి హత్య చేశారా?హత్య జరిగి 2 నెలలు దాటింది. కోట వినుత దంపతులు జైలుకు కూడా పోయారు. ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడంలో దీని వెనక ఏముందో అర్థమవుతుంది.
నాపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డిపాజిట్లు రాని వాళ్ళతో నాకేంటి సంబంధం? ఈ విషయంలో ఏరోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్ల గురించి ఎన్నడూ చెడ్డగా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం కోసం వినుత ఏనాడు పని చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మా అమ్మ ఓటు అడిగేందుకు వెళ్తే ఇంట్లోకి కూడా రానివ్వలేదు. రాజకీయ చరిత్ర ఉన్న మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలను. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలి. ఇవాళ నాపై బురద జల్లారు. రేపు మరొకరిపై బురద చల్లుతారు.
ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎన్నడూ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే బాధేస్తుంది. హత్య చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికి.. చెన్నై ఎస్పీ బహిరంగంగా ప్రకటించాక కూడా ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేయనట్లు కాదు. ఈ విషయంపై దర్యాప్తు జరగాలి. నేను ఏ విచారణకైనా సిద్ధమే. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. నేను సంజాయిషీ ఇవ్వడానికి మాట్లాడటం లేదు.
శ్రీకాళహస్తి అంటే దేవుని ప్రాంతం. నేను ఉండేది కాళహస్తిలో, పని చేసేది కాళహస్తి ప్రజల కోసమే. నాకు అనుమానాలు వస్తున్నాయి. ఆమె ఎందుకు ఇలా చేస్తుంది. క్రిమినల్ మెంటాలిటీ తో ఉన్నారు. వినుత మా ఇంటికి రెండు సార్లు వచ్చింది. నాకు ఏం అవసరం ఉంది ఆమె వీడియోలతో. లాయర్ ను సంప్రదిస్తాం. రాయుడు ఎవరో నాకు తెలియదు. ప్రజలకు అన్నీ తెలుసు. ఏమైనా ఉంటే పోలీసులకు ఆధారాలు ఇవ్వాలి. హత్య చేసిన వాళ్లే ఇలా చేస్తే.. పోలీసులు చర్యలు తీసుకోవాలి. నాన్న ఎలాంటి వారో అందరికీ తెలుసు. మా బ్రాండ్ గురించి అందరికీ తెలుసు. మేం తప్పు చెయ్యలేదు. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. మోదీ, చంద్రబాబు, పవన్ టికెట్ల ఇచ్చారు. కూటమిలో లెక్కలు ఉంటాయి. పెద్ద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం చేయొద్దు” అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.
కాగా.. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి కలకలం రేపుతోంది. కోట వినుత, ఆమె భర్త ప్రైవేట్ గా ఉన్న వీడియోలు, ఆమెకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుత డ్రైవర్ రాయుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది.
కాగా, జూలై 7న కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు.. రాయుడిని హత్య చేసి మర్నాడు చెన్నై కూవం నదిలో పడేసిన విషయం తెలిసిందే. రాయుడు బతికున్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకన్ల వీడియో ఆదివారం బయటకు రావడం సంచలనంగా మారింది. అప్పట్లో అది అతనే తీశాడా? లేక కోట వినుత దంపతులు బెదిరించి తీయించారా? అన్నది తెలియాల్సి ఉంది.
డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని కోట వినుత తెలిపారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. చేయని తప్పునకు మేము జైలుకెళ్లినందుకు బాధగా లేదు. కానీ.. మేమే చంపామని ప్రచారం చేయడం బాధ కలిగిందన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ.. మనుషుల ప్రాణాలు తీయడానికి కాదన్నారు. ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకుని బయటపడతామన్నారు. తనపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తామన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు కోట వినుత.