Damacharla Vs Balineni : ఒంగోలు రాజకీయాలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి. ఈ నెల 26న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో జాయిన్ కాబోతున్నారు. తొలిసారి ఒంగోలుకు వస్తుండటంతో బాలినేని అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, బాలినేని చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గం బాలినేని కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించింది. దీంతో మరోసారి ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కాయి. బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్లుగా ఒంగోలు రాజకీయాలు మారాయి.
జనసేనలో బాలినేని చేరికను టీడీపీ, జనసేన పాత వర్గాలు, బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో బాలినేని తమను తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తున్నారు. గతంలో తమపై అనేక కేసులు పెట్టారని, జైలుకి కూడా పంపించారని, కక్షపూరితంగా వ్యవహరించారని వాపోయారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 26న తాను జనసేనలో చేరబోతున్నట్లు బాలినేని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలినేని రాకను పురస్కరించుకుని ఆయన అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కూటమి నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టారు.
జనసేన జెండా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వంగవీటి రంగాల ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలు పెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో బాలినేని తమను ఎన్నో కష్టాలకు గురి చేశారి, ఎన్నో ఇబ్బందులు పెట్టారని, వాటన్నింటిని తాము ఎలా మర్చిపోతామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గానికి చెందిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలినేని ఫాలోవర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించేశారు. మున్సిపల్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి.. ఫ్లెక్సీలను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరిచారు.
కేవలం చిరంజీవి, నాగబాబు, కాపు నాయకుడు వంగవీటి రాధా ఫోటోలతో ఫ్లెక్సీలను తయారు చేయడం పెద్ద వివాదంగా మారింది. కూటమిలో మూడు పార్టీల నాయకులు ఉన్నారు. అయితే, టీడీపీ బీజేపీ నాయకులు ఫోటోలు పెట్టకుండా కేవలం జనసేన నేతల ఫోటోలు మాత్రమే పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
Also Read : మీరు మారరా? మాజీ సీఎం జగన్‌కు కేతిరెడ్డి ఇచ్చిన సలహా వైసీపీలో ఫైర్..!
మాజీ మంత్రి తాటిచెర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మంత్రులు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. ఆ సభలో ఎమ్మెల్యే దామచర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానని చెప్పిన బాలినేని.. ఇప్పుడు ఏ దిక్కు లేకపోవడంతో జనసేనలో చేరబోతున్నారని మండిపడ్డారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే బాలినేని జనసేనలో చేరబోతున్నారని ఎమ్మెల్యే జనార్దన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏ పార్టీలోకి వెళ్లినా బాలినేనిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దామచర్ల తేల్చి చెప్పారు. కేసుల నుంచి ఆయన తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుని కూడా దూషించారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని దామచర్ల మండిపడ్డారు. ఇప్పుడు కూడా జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.