మీరు మారరా? మాజీ సీఎం జగన్‌కు కేతిరెడ్డి ఇచ్చిన సలహాపై వైసీపీలో ఫైర్..!
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.

Gossip Garage Kethireddy Venkatarami Reddy Controversy (Photo Credit : Google)
Gossip Garage : చెప్పేవాడికి వినే వాడు లోకువ… అందుకే చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు. అంతేకాదు ఖర్చు లేని సలహాలివ్వడం కూడా చాలా తేలిక… ఇప్పుడెందుకు ఇలా చెబుతున్నామంటే.. వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉచిత సలహాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధికారంలో ఉండగా జనానికి సలహాలిచ్చిన సదరు మాజీ ప్రజాప్రతినిధి… ఇప్పుడు సొంత పార్టీతోపాటు అధికార పక్షానికి సూచనలు సలహాలిస్తున్నారు. దీంతో జనం పక్కన పెట్టినా.. సోషల్ మీడియా ట్రెండింగ్ కోసం ఇంకా తీరు మార్చుకోరా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనం.. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన సలహాలేంటి?
సోషల్ మీడియా ద్వారా సలహాలు సూచనలివ్వడం మాత్రం మానుకోలేకపోతున్నారనే విమర్శలు..
దేశవ్యాప్తంగా రాజకీయంగా కలకలం సృష్టించిన తిరుపతి లడ్డూ ప్రసాదంపై వైసీపీ నేతలు ఒకలా స్పందిస్తుంటే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం తనదైన స్టైల్‌లో సలహాలిచ్చి మరోసారి చర్చకు తెరలేపారు.
అధికారంలో ఉండగా, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ జనంలోకి వెళ్లి.. కనిపించిన వారికల్లా ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం పరిపాటిగా చెబుతుంటారు. ఆయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం సోషల్ మీడియాలో హిట్ అయినా… లోకల్‌గా మాత్రం ఆకట్టుకోలేదని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. కానీ, ఓ ట్రెండ్‌కు అలవాటైన వెంకట్రామిరెడ్డి… ప్రస్తుతం గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిలిపేసినా… సోషల్ మీడియా ద్వారా సలహాలు సూచనలివ్వడం మాత్రం మానుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వైసీపీతోపాటు తన ఓటమిపై గతంలో రకరకాల విశ్లేషణలు చేసిన కేతిరెడ్డి… ఇప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదంపై తనదైన సలహాతో వైసీపీలో హాట్ టాపిక్‌గా మారారు. ఎన్నికల్లో ప్రజలకు చేసింది చెప్పుకోలేక ఓడియాపోమని… ఇప్పుడు కూడా తిరుమల లడ్డూపై అధికార పక్షం చేస్తున్న ప్రచారం తిప్పికొట్టాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల ఆలయంలో ప్రమాణం చేయాలనే సూచన చేశారు కేతిరెడ్డి. వైసీపీ నేతగా ఈ సలహా ఇవ్వడం ఆయన ప్రాధమిక హక్కే అయినప్పటికీ… పార్టీ వేదికపైనో… అంతర్గతంగానో అధినేతకు ఈ విషయం చెబితే బాగుండేదని వైసీపీలో చర్చ జరుగుతోంది.
ఈ సలహాను కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. తాను తెలివైన వాడినని చాటుకోడానికే సోషల్ మీడియాలో ఇలాంటి సలహాలిస్తుంటారని కేతిరెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు విమర్శకులు. నిజంగా అధినేతపై అంత ప్రేమ ఉంటే.. నేరుగా వెళ్లి చెప్పొచ్చుకదా? అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ పొలిటీషన్‌గా గుర్తింపు..
ఇదే సమయంలో అధికార పార్టీకి కూడా కేతిరెడ్డి సుభాషితాలు వల్లించడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అలా మాట్లాడాల్సింది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కేతిరెడ్డిపై టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఏం మాట్లాడాలో కేతిరెడ్డిని అడిగి తెలుసుకోవాలా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు కూటమి నేతలు. వేష, భాషలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కేతిరెడ్డి… సోషల్ మీడియాలో యాక్టివ్ పొలిటీషన్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే ఆయన యాక్టివిటీ అంతా పూర్తిగా సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లకే పరిమితమవడంతో కార్యకర్తలతోనూ గ్యాప్ పెరిగిందంటున్నారు.
Also Read : వైసీపీలో వలసలకు కారణం ఏంటి? సంక్షోభం నుంచి బయటపడేదెలా?
వైసీపీలో కేతిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ..
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం. ఇక వైసీపీని వీడుతున్న వారంతా స్వార్థంతో పార్టీకి రాజీనామా చేస్తున్నారని లేని అధికారం, హోదా కల్పించుకుని కేతిరెడ్డి విమర్శలు గుప్పించడంపైనా సెటైర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉండాలా? వద్దా? అనే విషయంపై తర్జనభర్జన పడుతున్న కేతిరెడ్డి…. గులివింద చందంగా ఇతరులపై విమర్శలు గుప్పిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీలో కేతిరెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. తన ప్రచారం కోసమో.. నిజంగా అధినేతపై ప్రేమో కానీ, కేతిరెడ్డి చెప్పినట్లు శ్రీవారి లడ్డూలో తమ తప్పులేదని జగన్ ప్రమాణం చేస్తే ఎలా ఉంటుందంటూ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు.