వైసీపీలో వలసలకు కారణం ఏంటి? సంక్షోభం నుంచి బయటపడేదెలా?

చీమల దండులా ఒక పద్ధతి ప్రకారం నేతలు వైసీపీని ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.

వైసీపీలో వలసలకు కారణం ఏంటి? సంక్షోభం నుంచి బయటపడేదెలా?

Updated On : September 21, 2024 / 12:18 AM IST

Gossip Garage : ఇప్పుడు ఎన్నికలూ లేవు.. కొత్తగా నేతలకు అవకాశాలు వచ్చే పరిస్థితీ లేదు. కానీ, వైసీపీ నుంచి వలసలు మాత్రం ఆగడం లేదు.. ఆగే పరిస్థితీ కనిపించడం లేదట. రోజుకొకరు చొప్పున ఆ పార్టీ నుంచి నేతలు బయట పడుతుండటానికి కారణమేంటి? వైసీపీకన్నా ఇతర పార్టీల్లో ఎలాంటి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు? తమ రాజకీయ భవిష్యత్‌ కోసమే వైసీపీని వీడాలనుకుంటున్నారా? లేక మరేదైన రాజకీయ కారణాలు ఉన్నాయా? వైసీపీ నుంచి వలసలకు బ్రేకెందుకు పడటం లేదు….

వైసీపీ అలాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటోందా?
పార్టీని వీడే సమయంలో ఎవరో ఏదో చెబుతారు.. కానీ పార్టీలో ఉన్నవారూ అదే మాటంటే… ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంటున్న సంకేతాలు వస్తున్నట్లేనా…? ప్రస్తుతం వైసీపీ ఇలాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటోందా? అన్న చర్చ జరుగుతోంది. మూడు నెలల క్రితం వరకు తిరుగులేదనుకున్న ఫ్యాన్‌ పార్టీకి ఎన్నికల్లో రివర్స్‌ ఫలితాలు రావడంతో అంతా తలకిందులవుతోంది. ముఖ్యంగా పదవుల్లో ఉన్నవారు.. మాజీలైన నేతలు కూడా వైసీపీని వీడేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీకి రాం రాం చెప్పేశారు. ఇప్పుడు ఈ లిస్టులో చాలా పేర్లు చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.

అవకాశాలు వెతుక్కుంటూ ఇతర పార్టీల్లోకి జంప్..
ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్యాడర్‌ను దిశానిర్దేశం చేయాల్సివుండగా, వారే ముందుగా తట్టా బుట్టా సర్దేస్తున్నారు. దీంతో గ్రామస్థాయి నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఈ వలసలు చాపకింద నీరులా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నా.. అధిష్టానం ఏమాత్రం లెక్కచేయడం లేదు. దీంతో అవకాశాలు వెతుక్కుంటూ చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. ఆలస్యం చేస్తే ఎక్కడ వెనకబడిపోతామనే బెంగతో కూటమి పార్టీల్లో తెలిసిన నేతల ద్వారా పైరవీలు ముమ్మరం చేశారు.

వైసీపీలో ఉంటడం సేఫ్‌ కాదని అనుకుంటున్న కాపు నేతలు..!
ఇలా ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నట్లుగా ప్రతి జిల్లాలోనూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కేడర్‌కు అందుబాటులో లేని నేతలు వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ ఎఫెక్ట్‌తో ఎక్కువ మంది వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కాపు సామాజికవర్గం నేతలు…. వైసీపీలో ఉంటడం సేఫ్‌ కాదని అనుకుంటున్నారట..

వలస వెళ్లే వారి స్టులో చాలామంది పేర్లు..
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు ఎప్పుడైనా వైసీపీకి రాజీనామా చేసే చాన్స్‌ ఉందంటున్నారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూడా వైసీపీకి బైబై చెప్పేయాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు ఓ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ప్రస్తుతం హైదరాబాద్‌లో మకాం వేసి… ఆ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇదే సమయంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : వలస నేతలంతా చలో జనసేన అనటానికి కారణమేంటి? చేరికలపై పవన్ కల్యాణ్ వైఖరేంటి?

ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనూ వలసలు..
ఇలా ఒక్క గోదావరి ప్రాంతంలోనే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనూ వలసలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతలు కాకుండా ముందుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చేర్చుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయించడంతో మున్సిపాలిటీలు, మండల పరిషత్‌ల్లో సభ్యులు గంపగుత్తగా టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. క్యాడర్‌ మొత్తం ఖాళీ అయిపోతుండటంతో తాము ఉండి ప్రయోజనమేముందనే ఆలోచనతో ఎమ్మెల్యే స్థాయి నేతలు వైసీపీని వదిలేయాలని డిసైడ్‌ అవుతున్నారు. మొత్తానికి చీమల దండులా ఒక పద్ధతి ప్రకారం నేతలు వైసీపీని ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.