సుబ్బయ్య హత్యతో నాకు సంబంధం లేదు : అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రమాణం

MLA Sivaprasad Reddy on murder of Subbaiah : కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు నందం సుబ్బయ్య హత్య జరిగిన తర్వాత.. ఆ హత్యకు కారణం స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ కమిషనర్‌ అంటూ పేర్లు రావడంతో రాజకీయంగా ఈ మర్డర్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. నారా లోకేష్ స్వయంగా ఎంట్రీ ఇవ్వడంతో ప్రొద్దుటూరులో వాతావరణం హాటెక్కింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చౌడేశ్వరీ ఆలయంలో “నందం సుబ్బయ్య హత్యతో నాకు సంబంధం లేదు” అని ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాచమల్లు.. తెలుగుదేశం నేతల విమర్శలకు భయపడి ప్రమాణం చేయట్లేదని, ప్రొద్దుటూరు ప్రజలకోసమే ప్రమాణం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నందం సుబ్బయ్య హత్యతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుబ్బయ్యను హత్య చేయమని నేను ఎప్పుడూ చెప్పలేదని, హత్య గురించి తెలిసి ఉంటే చౌడమ్మతల్లి సాక్షిగా ఆపి ఉండేవాడిని అన్నారు. హత్య జరిగిన విషయం ప్రొద్దుటూరు ప్రజలకు ఎలా తెలిసిందో.. నాకూ అలానే తెలిసిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే.. తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని అన్నారు.

కార్యకర్తగా సుబ్బయ్య తన వద్దే పనిచేశాడని, సుబ్యయ్య నేర చరిత్ర కలిగిన వ్యక్తని, ఆయనపై రెండు కేసులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జైలుశిక్ష కూడా అనుభవించాడని, పాత కక్షల కారణంగానే సుబ్బయ్యను హత్య చేసి ఉండవచ్చు అని అన్నారు. టీడీపీ నేతలు మాత్రం కావాలనే శవ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.