కూటమిలో పంపకాల లొల్లి తప్పదా? పదవి దక్కేదెవరికి? 

మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆయనకు ఓ సీటు ఖాయమైపోయింది.

CM Chandrababu Naidu

ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ బెర్త్‌లకు ఫుల్‌ గిరాకీ వచ్చింది.. ఒక్కో బెర్త్‌కు ముగ్గురు నలుగురు వెయిటింగ్‌లో ఉన్నారు.. ఒకవేళ పెద్దల సభకు గ్రీన్‌ సిగ్నల్‌ దొరక్కపోతే కనీసం నామినేటెడ్‌ పోస్టులైనా దక్కించుకోవాలని నేతలు ఫుల్‌ బిజీగా ఉన్నారు.. మరి కూటమి పెద్దలు ఈక్వేషన్స్‌ ఏంటి? పదవి దక్కేదెవరికి? వెయిటింగ్‌ తప్పనిదెవరికి? పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చేంటి?

పొత్తులంటేనే త్యాగాలు.. ఏపీ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీల నేతలెందరో టికెట్లను త్యాగం చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో వారంతా ఎమ్మెల్సీల ఖాళీలపై ఆశగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్లు ఎన్ని ఖాళీ కాబోతున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. సీటు కన్‌ఫామ్ చేసుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట.

ఇప్పటికే వీరు రాజీనామా
మండలిలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. వీటిని మండలి చైర్మన్‌ ఆమోదించాల్సి ఉంది. ఇంకా కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రిజైన్ లెటర్ రాసిపెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు మార్చి నెలాఖరులోగా మరో అయిదుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. ఇలా లెక్కలేసుకుంటూ పోతే.. మొత్తం 12 నుంచి 15 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగినా పెరగవచ్చనేది పొలిటికల్‌ టాక్‌..

ఐతే ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో సెటిల్ అవ్వాలని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ, బీజేపీ జనసేన పార్టీల్లో తీవ్రంగా పోటీ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ సీటు కోసం ఎవరి స్టైల్లో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పుడు చాన్స్ మిస్ అయితే మళ్లీ పదవి దక్కడం కష్టమేనని ఆశావహులు భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

వీరికి ఇప్పటికే హామీ
మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆయనకు ఓ సీటు ఖాయమైపోయింది. రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవికి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వంగవీటి రాధకు కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవ్వడంతో టీడీపీ ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పేరును ప్రకటించింది.

ఇక మిగిలిన సీట్ల కోసం మూడు పార్టీల నేతల పోటీ పడుతున్నారు. పిఠాపురం వర్మ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, జవహర్, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో, సామాజిక – ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి చివరగా చంద్రబాబు అవకాశం ఇస్తారనేది ఇప్పుడు కూటమిలో ఉత్కంఠను పెంచుతోంది.

2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నా.. పొత్తుల సద్దుబాట్లతో సీట్లు కోల్పోయిన వారికి ఈసారి ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. దీంతో ఎవరికి మండలిలో బెర్త్‌ కన్‌ఫామ్‌ అవుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్‌ చేశారా? కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు హరీశ్‌ను వాడుకుంటున్నారా?