MLC Elections: ఎమ్మెల్సీ బెర్త్ ఆశించి భంగపడ్డవారి ఫ్యూచర్ ఏంటి? వీరికి ఇందుకే అవకాశం ఇవ్వలేదా? 

ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కనివారిలో కొందరికి త్వరలోనే క్యాబినెట్ ర్యాంకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారట.

Chandrababu Naidu

టీడీపీ.. ఏపీలో వన్ ఆఫ్ ది పవర్ ఫుల్ పార్టీ. అధికారంలో ఉన్నా.. అపోజిషన్‌లో ఉన్నా.. ఆ పార్టీకి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉంటారు. అందుకే పార్టీ పదవులు అయినా..ప్రభుత్వ పదవులు అయినా..తెలుగు తమ్ముళ్ల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ భారీగా ఆశావహులు కనిపించారు.

ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి..తమకే వస్తాయని ఆశపడ్డవారికి భంగపాటు తప్పలేదు. ఏపీ సర్కార్లో మూడు పార్టీలు కూటమిగా ఉండటంతో..5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి ఇవ్వడంతో టీడీపీకి మూడే సీట్లు దక్కాయి. పదిహేను ఇరవై మంది టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బెర్త్ ఆశిస్తే.. ఎందరో పేర్లు ప్రచారంలో వినిపిస్తే..ఊహకు కూడా అందని విధంగా కావలి గ్రీష్మ, బీదా రవిచంద్రయాదవ్, బీటీ నాయుడకు అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం.

కొత్తగా ఎమ్మెల్సీ సీటు ఆశించినవారు కొందరైతే..ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన నేతలు కూడా శాసనమండలికి వెళ్లాలని ఆశపడ్డారు. ఇక ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు రెన్యూవల్ కోసం ప్రయత్నించారు. సిట్టింగ్లలో బీటీ నాయుడుకు మాత్రమే అవకాశం దక్కింది. ఇక ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్న నేతలెవరికీ బెర్త్ దక్కలేదు. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమా, SVSN వర్మకు అదృష్టం వరించలేదు.

ఇక తిరువూరు సీటును వదులుకున్న మాజీ మంత్రి జవహార్కు నిరాశే మిగిలింది. ఈ ముగ్గురితో పాటు కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, కోడెల శివప్రసాద్ కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. వీళ్లెవరికీ అవకాశం దక్కకపోవడంతో ఆశావహులంతా నిరాశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొందరు అయితే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి కూడా రావడం లేదట. దీంతో అలకబూనిన నేతలను టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ చేసి బుజ్జగిస్తున్నారా?
టీడీపీ నుంచి పలువురు ఆశావహులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. సీనియర్ నేత యనమల రామకృష్ణకు సీటు రెన్యూవల్ కాలేదు. ఎమ్మెల్సీ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న సీనియర్లు ..సీట్లు త్యాగం చేసినవారికి నచ్చజెప్పేందుకు టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయిని..వాటిలో ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పారంటూ ఆశావహులకు ఫోన్ చేసి బుజ్జగిస్తున్నారట.

పదవీ విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడుకు ప్రత్యేక కారణాలతో తిరిగి ఛాన్స్ దక్కింది. సీనియర్ నేతల్లో యనమల..పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సీట్లు ఇవ్వకపోవటం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. తనకు సీటు ఇవ్వకపోవటంపై వర్మ తన మద్దతుదారుల దగ్గర చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యనమల కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు పదవుల్లో ఉన్నారు. కుమార్తె తుని ఎమ్మెల్యేగా, మైదుకూరు నుంచి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్, అల్లుడు మహేశ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. దీంతో యనమలకు సీటు రెన్యూవల్ చేయలేదని అంటున్నారు. యనమల సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్రకు సీటు ఖాయం చేశారు. ఇక ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గంజి వీరాంజనేయులుకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే అవకాశం ఇవ్వలేదా?
సీట్లు ఆశించి అవకాశం దక్కని నేతలందరికీ సర్ధిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ సారి అవకాశం ఇవ్వకపోలేయామంటూ పిఠాపురం వర్మ, మాజీమంత్రి జవహర్, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్‌తో పాటు అశోక్ బాబు, మల్యాద్రికి ఫోన్ చేసి మరీ పరిస్థితి వివరించారట. మిత్రపక్షాలకు రెండు సీట్లు ఇవ్వటంతో పాటుగా సామాజిక – ప్రాంతీయ లెక్కలతోనే అవకాశం కల్పించలేకపోయామని నచ్చజెప్పారట.

పదవుల విషయంలో చంద్రబాబు అందరినీ సంతృప్తి పరచలేని పరిస్థితుల్లో ఉన్నారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. కొందరు సీట్లు త్యాగం చేశారు..మరికొందరు సీనియర్లు, ఇంకొందరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు.. అందరూ పార్టీకి అవసరమే కానీ.. పొత్తు ఉంది కాబట్టి ఆశావహులందరికీ పదవులు ఇవ్వడం సాధ్య కావడం లేదని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు.

ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కనివారిలో కొందరికి త్వరలోనే క్యాబినెట్ ర్యాంకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారట. మరికొందరికి 2027లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పిస్తారట. ఇలా సిచ్యువేషన్ ఏంటో..నేతల పట్ల చంద్రబాబు కన్సర్స్ ఏంటో వివరించి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఆశావహులంతా పరిస్థితిని అర్ధం చేసుకున్నారని..కాకపోతే పదవులు రావడం ఆలస్యం అవుతుందనే బాధ మాత్రం ఉందంటున్నారు టీడీపీ నేతలు.