Marri Rajasekhar
Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, శాసన మండలి సభ్యత్వానికి రాజశేఖర్ రాజీనామా చేశారు. గతంలో చిలకలూరి పేట ఎమ్మెల్యేగా, వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ఆయన వ్యవహరించారు.
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.
మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత 2011లో ఆయన వైసీపీలో చేరారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. ప్రతిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో చిలకలూరిపేట టికెట్ ఆశించినప్పటికీ.. ఆయనకు అవకాశం దక్కలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మర్రి రాజశేఖర్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ ఆయనకు అవకాశం దక్కలేదు. నాటి నుంచి వైసీపీ అధిష్టానం పట్ల ఆయన అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 19 వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.