Andhra University
Andhra University – Allegations : విద్యార్థులకు విద్య బోధించాల్సిన గురువులు కొందరు దారి తప్పుతున్నారు. కామవాంఛతో రగిలిపోతూ లైంగిక వేధింపులక పాల్పడుతున్నారు. తమ హోదాను దుర్వినియోగం చేస్తూ విద్యార్థినులను వేధిస్తున్నారు. కోరిక తీర్చాలంటూ ఆడపిల్లలను టార్చర్ పెడుతున్నారు కొందరు కీచక గురువులు.
తాజాగా ఆంధ్రా యూనివర్సిటీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. హిందీ విభాగం హెడ్ ప్రొఫెసర్ నల్ల సత్యనారాయణపై.. రీసెర్చ్ స్కాలర్ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పీహెచ్ డీ కావాలంటే తనతో బయటకు రావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు థీసిస్ పూర్తి చేసేందుకు ఏకంగా రూ.2లక్షలు అడిగారని ఆరోపణలు గుప్పించారు.
ఇప్పటికే రూ.75వేలు ఇచ్చినట్లుగా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు బాధిత విద్యార్థి. మిగిలిన లక్ష 25వేల రూపాయల కోసం ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. దీనిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించారని ఆరోపించారు. విధి లేని పరిస్థితుల్లో జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశానన్నారు బాధిత విద్యార్థి.
మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రొఫెసర్ నల్ల సత్యనారాయణ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అందులో నజం లేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆ స్కాలర్ అసలు తన విద్యార్థే కాదన్నారు ప్రొఫెసర్ నల్ల సత్యనారాయణ. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారాయన. అయితే, యూనివర్సిటీ కమిటీతో విచారణ జరిపిస్తే తనకు న్యాయం జరగదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఆంధ్రా యూనివర్సిటీలో కలకలం రేపుతున్నాయి.