×
Ad

Cyclone Montha : దూసుకొస్తున్న మొంథా తుపాన్.. మొబైల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి.. కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు రెడీ చేసుకోండి.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు..

Cyclone Montha మొంథా తుపాను ఏపీవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఏపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.

Montha Cyclone

Cyclone Montha : ఏపీ వైపు మొంథా తుపాన్ దూసుకొస్తుంది. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వివిధ శాఖల మంత్రులు వేరువేరుగా జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మొంథా తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని తగిన వనరులతో సిద్ధంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలకు తుపానుపై అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగా సిద్ధం చేయాలని సూచించారు. ఆర్అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలు, పౌరసరఫరాలకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Also Read : Cyclone Montha : ఏపీ ప్రజలకు హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు..

ప్రజలు ఈ సూచనలు పాటించాలి..
♦ మొంథా తుపాను ఏపీవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులు ఏపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.
♦ వాతావరణ హెచ్చరికలపై ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ లు గమనించాలని, సోషల్ మీడియాలో వచ్చే వందతులు నమ్మొద్దొని సూచించారు.
♦ తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముంపు ప్రాంతాల ప్రజలు విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు, ఇతర వస్తువులను వాటర్ ప్రూఫ్ కవర్లో భద్రపర్చుకోవాలని సూచించారు.
♦ ఈనెల 30వ తేదీ వరకు తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని.. ఈ క్రమంలో వారానికి సరిపడా తాగునీరు, పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, రెడీ టూ ఈట్ ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
♦ తుపాను నేపథ్యంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని.. ముందస్తుగా మొబైల్ ఫోన్లు పూర్తిస్థాయిలో చార్జింగ్ పెట్టుకోవాలని, కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు, చార్జింగ్ ఎమర్జెన్సీ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
♦ భారీ స్థాయిలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. తీవ్ర గాలులకు హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని.. వాటికి ప్రజలు దూరంగా ఉండాలని.. వాటి సమీపంలోకి వెళ్లొద్దని సూచించారు.
♦ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పశువులు, జంతువులకు కట్టిన తాళ్లను వదిలేయాలని సూచించారు.