ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ్యాయి. గురువారం నాటికి రాష్ట్రంలో 893 కేసులు నమోదయ్యాయి. ఒక్క నాలుగు జిల్లాల్లోనే 590 కేసులు వరకు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం 48,034 టెస్టులు చేశారు. టెస్టులు, పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇన్ఫెక్షన్ రేటు 1.85 శాతం మాత్రమే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. డిశ్చార్జి అయ్యే పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ నియంత్రణలోనే ఉందని అంటున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 17,884 శాంపిల్స్ పరీక్షించారు. 590 పాజిటివ్ వచ్చాయి. మిగతా 17,294 కేసులు నెగిటివ్ అని నిర్ధారించారు. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో కర్నూలు జిల్లాలోనే 26.20 శాతం నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 21.83 శాతం కేసులు ఉండగా, రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 48.03 శాతం కేసులు నమోదయినట్టు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 181 క్లస్టర్లను గుర్తించినట్టు తెలిపారు. 573 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్. జవహర్‌రెడ్డి చెప్పారు. 66 శాతం కేసులు కేవలం 4 జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. నగరంలోనే ఉన్నాయన్నారు. రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో 14 కేసులు మినహా.. ఇతరత్రా నమోదవుతున్న కేసులన్నీ రెడ్‌జోన్లలోనే ఉన్నాయి. కరోనా టెస్ట్‌లు చేయడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానం ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 181 క్లస్టర్లు ఉన్నాయి. 121 పట్టణ ప్రాంతాల్లో, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 573 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. 56 మండలాలు రెడ్‌జోన్‌లో, 47 ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. జిల్లాల వారీగా 590 కేసులు నాలుగు జిల్లాల్లోనే నమోదయినట్టు చెప్పారు. దేశంలో 10 లక్షల జనాభాకు సగటున 334 టెస్ట్‌లు చేస్తుంటే ఏపీలో 961 టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో ఒక్కొక్కరికి 3 మాస్స్‌లు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వేల పడకలకు 2.21 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టారు. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ ట్రీట్ మెంట్ ఎంతో మంచిదని ICMR స్పష్టం చేసింది.
ర్యాపిడ్ టెస్ట్‌లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి 25 నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క ల్యాబొరేటరీలో 90 టెస్టుల సామర్థ్యం ఉండేది. ఇప్పుడు ల్యాబొరేటరీల సంఖ్య 9కి పెంచి రోజుకు 3,480 టెస్టులు చేసే స్థాయికి చేరుకున్నాం. ఎక్కడ టెస్టులు చేసినా వైరాలజీ ల్యాబొరేటరీలో చేసేదే ఫైనల్ అవుతుంది. ఎక్కువ మందికి ప్రాథమిక స్క్రీనింగ్ చేసేందుకు ర్యాపిడ్ టెస్టులు అవసరం అవుతాయి. ఔట్ పేషెంట్ సేవలకు ఇబ్బంది లేకుండా 14410 నంబర్ ద్వారా టెలి మెడిసిన్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకూ 306 మంది డాక్టర్లు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చారు. 4 వేల మందికి పైగా ఈ పద్ధతిలో వైద్య సేవలు పొందారు.