Kesineni Sivanath: తిరువూరు మండలంలోని పలు గ్రామాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఎంపీ కేశినేని శివనాథ్. వావిలాల గ్రామం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు తనపై చేసిన ఆరోపణలను ఎంపీ శివనాథ్ ఖండించారు.
నా క్యారెక్టర్ ఏంటి అనేది తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. పొద్దునే దేవినేని అవినాష్ లాగా, మధ్యాహ్నం పేర్నినాని లాగా, సాయంత్రం కేశినేని నాని లాగా, రాత్రికి స్వామి దాసులాగా ఉండే క్యారెక్టర్ కాదన్నారు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, కార్యకర్తని అని తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ను విమర్శించిన వాళ్ల అంతు చూస్తామని హెచ్చరించారు.
”ఒక పని మొదలు పెడితే కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాను. భారీ నష్టంతో నా జేబులో డబ్బుతో విజయవాడ ఉత్సవ్ నిర్వహించటం జరిగింది. గత నాలుగేళ్లుగా తిరువూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకున్నానని ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మొన్నటివరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారు. ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలి. నేను ఏంటో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు.
అందుకే నాపై విమర్శలు చేసిన క్షణం నుంచి ప్రకంపనలు మొదలయ్యాయి. తిరువూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్, దబ్బాక వెంకటేశ్వర్లు, ప్లీకా నాయక్, రాయన సుబ్బారావు ఆర్థిక పరిస్థితి ఎంటో అందరికీ తెలుసు. వాళ్లంతా పార్టీలో కష్టపడి పదవులు సంపాదించుకున్నారు. విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు చూపించాలి. మండలాధ్యక్షలను డిక్లేర్ చేసింది ఎవరో అందరికీ తెలుసు. డిక్లేర్ చేసిన ఆయన తీసుకున్నారేమో తెలియదు. మండలాధ్యక్షులను నేను డిక్లేర్ చేయలేదు.
విజయవాడలో కూర్చుని పదవులు ఎవరు డిక్లేర్ చేశారో అందరికీ తెలుసు. ఎవరు అవినీతికి పాల్పడినా, ఇసుక అక్రమ రవాణా చేసినా తెలుగుదేశం పార్టీ క్షమించదు. దేవినేని అవినాష్ తినేది రక్తపు ముద్ద. అక్రమ ఇసుక రవాణాలో అవినాష్ వాటా ఎంతో తెలుసు. మద్యం, ఇసుక, మట్టితో అక్రమ వ్యాపారం చేసిన ఎవరినీ వదిలి పెట్టము. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు చేసిన స్కామ్స్ అన్నీ బయటికి వస్తున్నాయి. ఈ స్కామ్స్ వెనుకున్న నాయకుడు ఎవరో కూడా బయటికి వస్తారు.
ఎన్నికల సమయంలో కేశినేని నాని.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను తీవ్రంగా విమర్శించారు. అలాంటి విమర్శలు చేసిన వ్యక్తి ఫోటోలు పెట్టుకునే వైసీపీ కోవర్టులకు పదవులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. వైసీపీ నాయకులతో అంటకాగితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు తెలియకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆస్తులైనా పోగొట్టుకుంటారు. కానీ ఆత్మాభిమానానికి అవమానం జరిగితే సహించరు.
తిరువూరు ఎమ్మెల్యే దూకుడుకి అపరిపక్వత, రాజకీయ అవగాహన లేకపోవటమే కారణం. అందుకే ప్రజలు, నాయకులు, మీడియాతో సఖ్యత లేదు. అధిష్టానానికి ఇబ్బంది కలిగించే విషయాలు ఏమీ చేయను. ఏ కార్యక్రమం చేసినా అధిష్టానికి తెలియజేసే చేస్తాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఏం ఫిర్యాదులు చేసినా మంచిదే. అన్ని విషయాలు బయటికి వస్తాయి. దేవినేని అవినాష్ నాయకత్వంలో కోవర్టులు, వైసీపీ నాయకులు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కోవర్టులపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది.
అధికారులు, నాయకులు ఎవరూ ఇబ్బంది పడటం లేదు. కోవర్టులు ఎవరనేది అందరికీ తెలుసు. తిరువూరులో సీఎం చంద్రబాబు గ్రూపు ఒక్కటే ఉంది. మరో గ్రూపు లేదు. ఎంపీ కార్యాలయం నుంచి నా పర్యటన గురించి తిరువూరు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో మండల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు. తిరువూరు ఎమ్మెల్యే వేరే కార్యక్రమాల్లో బిజీగా వుండటం వల్ల రాకపోయి ఉండొచ్చు.
విజయవాడకు 6 ఆర్వోబిలు, ఆర్.యు.బిలు రాబోతున్నాయి. రాబోయే మూడు నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. తిరువూరులో లెదర్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించటం జరిగింది. తిరువూరులో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సీఎంఆర్ఎఫ్ లు ఇంకెవ్వరూ ఇవ్వలేదు. తిరువూరు ఎమ్మెల్యేకి తెలుగు దేశం పార్టీ ఏమైపోయినా పర్వాలేదు. రాజకీయాలు పట్టవు. ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్లే పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్తారు. కట్లలేరు బ్రిడ్జ్, ఎ.కొండూరు-విసన్నపేట రహదారి సమస్యలు మూడు నెలల్లో పరిష్కరిస్తాను” అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.