వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముద్రగడ పద్మనాభం భేటీ

ముద్రగడ పద్మనాభం తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.

Mudragada Padmanabham: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు. తన మద్దతుదారులను జగన్‌కు పరిచయం చేశారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించడంతో తన ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మద్దతుదారులతో పాటు జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైసీపీపై జరుగుతున్న దాడులు గురించి వీరు చర్చించినట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ నేతలు కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇదిలావుంటే, శనివారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటిస్తారు. ఈనెల 8న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పిస్తారు.

కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ మద్దతుదారులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీకి ఓటు వేయనివారిపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దాడులకు ఫుల్‌స్టాఫ్ పెట్ట‌క‌పోతే రియాక్షన్ ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Also Read : పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పొద్దు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫన్నీ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు