ఏపీలో నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

ఏపీలో ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి.

municipal election campaign : ఏపీలో ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం చేసే లక్ష్యంతో అధికార వైస్సార్‌సీపీ ప్రయత్నాలు చేయగా… మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో టీడీపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది.

మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలకు అప్పగించారు వైఎస్‌ జగన్‌. ఆయన సాధారణ పరిపాలనకే పరిమిమయ్యారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే చిత్తూరు జిల్లాలో మరోసారి పెద్ద మొత్తంలో వార్డులు ఏకగ్రీవం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపు కోసం తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. వలసలను ప్రోత్సహించారు. మిగిలిన మంత్రులు ఆయా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకోగా.. విశాఖటప్నం, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్‌షో నిర్వహించారు. టీడీపీలో అంతర్గత విభేదాలను చక్కబెడుతూనే ప్రచారం చేశారు. ఇక గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు నారా లోకేష్‌. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించగా.. ఓ అభిమానిపై చేయి చేసుకోవడం వివాదస్పదంగా మారింది.

బీజేపీ, జనసేన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కలిసి బరిలో నిలిచాయి. అవగాహనతో సీట్ల పంపకాలు చేసుకున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం బీజేపీ ప్రచారానికి అడుగడుగునా బ్రేకులు వేసినా.. ఆ పార్టీ నేతలు వెనక్కి తగ్గలేదు. జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ విశాఖ కార్పొరేషన్‌తో పాటు ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తారని ప్రకటించినా…. ప్రచారానికి దూరంగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు