Kottu Satyanarayana (Photo : Google)
Kottu Satyanarayana – Chandrababu : ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం అన్నారాయన. జైలుకి వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రజలను మరోసారి మోసం చేయడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారు అని మంత్రి కొట్టు ధ్వజమెత్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆరెయ్ ఒరెయ్ అని అనడం దారుణం అన్నారు. చంద్రబాబు చెప్పే మాటలు చెబుతూ ఉంటే పవన్ పరువు తగ్గిపోతుందన్నారు. పవన్ తన మాటలతో తన పరువు తానే తగ్గించుకున్నారు అని అన్నారు.
” గ్రామ వాలంటీర్ ని చెప్పుతో కొట్టాలంటున్నారు. దేనికి చెప్పుతో కొట్టాలి? గ్రామ వాలంటీర్లు ప్రతి పథకాన్ని ఇంటికి చేరవేస్తున్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచేశారు. చంద్రబాబు జైలుకి పోతారు. అమరావతిలో సింగపూర్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సింగపూర్ లో అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి” అని మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు.