Nadendla Manohar
Janasena Party: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తూర్పు, పశ్చిమలో ఊహించిన దానికన్నా విజయవంతం అయ్యిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర అన్నారు. జనసేనతో కలిసి నడవాలని ప్రజల్లో స్పష్టంగా కనపడుతుందని అన్నారు. ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారని, రాబోయే రోజుల్లో జనసేన ఏం చేసేది స్పష్టంగా ప్రజలకు వివరించటం జరుగుతుందని మనోహర్ చెప్పారు.
మహిళలు, యువత, వృద్ధులు, లా అండ్ ఆర్డర్, పెన్షన్, రైతు సమస్యలు, చేనేత, మహిళలు, మత్స్యకారులు, మరికొన్ని వర్గాలు ప్రజలు వారు ఎదుర్కొనే సమస్యలు వినతి పత్రాల రూపంలో అందజేయటం జరిగిందని, పెన్షన్, రోడ్లుపై ఎక్కువ వినతి పత్రాలు వచ్చాయని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముఖ్యంగా దివ్యాంగులు ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం కన్నా కేవలం ఆర్భాటాలకు, ప్రచారాలకు, ప్రత్యర్థులపై దాడులకు ముందుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్కారంలేని మనుషులు పాలనచేస్తే ఇలానే ఉంటుందని విమర్శించారు.
Pawan Kalyan : వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు : పవన్ కళ్యాణ్
99శాతం హామీలు పూర్తి చేశామని అన్నప్పుడు స్పందన కార్యక్రమాలు ఎందుకు అని నాదెండ్ల ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న ప్రజలపై, నాయకులపై వందల సంఖ్యలో కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రైతుల దగ్గర కూడా లంచాల తీసుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలన చెయ్యటం చేతకాక వేల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిషత్తు పవన్ కళ్యాణ్ ద్వారానే జరుగుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
పవన్ కళ్యాణ్‌పై వైసీపీలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఎందుకు దూషణలకు దిగుతున్నారో అర్థంకావడం లేదని అన్నారు. బటన్ నొక్కినప్పుడు కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రచారం చేస్తారు.. క్షేత్ర స్థాయిలో మాత్రం పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు పడవు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పారు. రెండో విడత వారాహి యాత్ర పశ్చిమలోనే కొనసాగిస్తామని, రెండో విడత యాత్రపై త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అవసరం అయితే తమతో కలిసి వస్తామన్న ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు.