Nagababu: నాగబాబును ఏడాదిన్న తర్వాతే క్యాబినెట్‌లోకి తీసుకుంటారా? ఎందుకంటే?

ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మంత్రివర్గమే కొనసాగుతుందని అంటున్నారు కూటమి లీడర్లు.

మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో కీలకంగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ తరఫున అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నాగబాబును లోక్‌సభ ఎంపీగా పోటీ చేయించాలనుకున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేసిన పవన్‌..తన సోదరుడికి సర్ధిచెప్పుకున్నారు. ఆ తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపుతారన్న టాక్ వినిపించింది. అదీ కుదరలేదు. కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు చంద్రబాబు.

కాకపోతే అది ఇప్పట్లో అయ్యేలా లేదన్న టాక్ వినిపిస్తోంది. మొన్నే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటే..టీడీపీలోని ఆశావహులతో పాటు బీజేపీ నేతల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందట. అందుకే నాగబాబును ఇప్పట్లో మంత్రివర్గంలోకి తీసుకోరని.. ఏడాదిన్నర తర్వాత ఆయనకు అమాత్య యోగం దక్కొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో అసెంబ్లీ సీట్లను బట్టి.. 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, నాదెండ్ల మనోహర్‌ మంత్రులుగా ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం నాగబాబుకు ఇస్తారని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవడం కరెక్టా కాదా అని లెక్కలు వేసుకుంటున్నారట కూటమి పెద్దలు.

2027లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు
ఏపీ మంత్రివర్గం ఏర్పాటై 9 నెలలు అవుతుంది. మంత్రులు తన శాఖలపై పట్టు సాధించేందుకు ఈ సమయం తక్కువే. మరో ఏడాది అయితే వారి పనితీరుపై ఓ నిర్ణయానికి రావొచ్చు. అందుకే క్యాబినెట్‌ రీషఫిలింగ్ పేరుతో ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని భావిస్తున్నారట కూటమి పెద్దలు. మొదటి మూడేళ్లు మంత్రివర్గం అలాగే ఉంచి చివరి రెండేళ్ళలో మార్పులు, చేర్పులు చేపట్టొచ్చంటున్నారు.

అంటే 2027లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసి కొంతమందిని తీసుకుని కొందరికి శాఖలు మారుస్తారని అంటున్నారు. అలా అప్పటిదాక ఆగడానికి మరో కారణం కూడా ఉందట. 2027లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆ సీట్లన్నీ కూటమికే దక్కుతాయి. అలా పలువురు నేతలకు హామీ ఇచ్చినట్లుగా వారిని ముందు చట్టసభల్లో చోటిచ్చి..వారిలో అర్హులకు మంత్రి పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట.

ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మంత్రివర్గమే కొనసాగుతుందని అంటున్నారు కూటమి లీడర్లు. ఇక సడెన్‌గా ఎవరినైనా తీసుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితులు అయితే ఏమీ లేవని అంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది. కానీ ఆయనను ఎప్పుడు క్యాబినెట్‌ తీసుకోవాలన్నిది సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అయితే నాగబాబును తీసుకుంటే మిగిలిన వారి నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతాయేమోనని భావిస్తున్నారట.

నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే బీజేపీ, టీడీపీలోని ఆశావహులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నారట. దాంతో పాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత మంత్రిగా అవకాశం ఇస్తే బెటర్‌గా రాణిస్తారనే ఆలోచన కూడా ఉందట. పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ హామీ పెండింగ్‌లో ఉంది. ఆయనతో పాటు మరికొందరికి ఆ హామీని తీర్చి ఆ తర్వాత నాగబాబు సహా ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారట. అయితే ఈ నెల 30న ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఆయనకు మంత్రి పదవి ఆలస్యమన్న వార్తల్లో నిజమేంతో వేచి చూడాలి మరి.