Nara Bhuvaneswari
Chandrababu Interim Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆయనకు నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు బెయిల్ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. చంద్రబాబుకోసం ప్రజలు చేసిన పోరాటం ఫలిచిందని, ఇది ప్రజల గెలుపు అన్నారు. నారీ శక్తి గెలిచింది.. ఆయనకోసం పోరాడిన అందరికీ ధన్యవాదాలు అంటూ నారాభువనేశ్వరి తెలిపారు. ఇదిలాఉంటే మంగళవారం నారా భువనేశ్వరి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతిలోని తన నివాసానికి వెళ్తారు. ఆయన వెళ్లే మార్గంలో ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ఎస్జీ సెక్యూరిటీ, చంద్రబాబు కాన్వాయ్ జైలు వద్దే అందుబాటులో ఉంది. కాన్వాయ్ ద్వారా చంద్రబాబు సెంట్రల్ జైలు నుంచి అమరావతికి బయలుదేరుతారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం హైదరాబాద్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.