Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లోఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి సోమవారం ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో వీరు ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో యనమల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కావాలనే అక్రమ కేసులు పెట్టారని ప్రజలందరూ గుర్తించారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారని, వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారని యనమల తెలిపారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారని యనమల మీడియాతో చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఎంతగానో శ్రమించారని, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తుత పాలకులు ధ్వసం చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా భవిష్యత్ గురించి ఆలోచించే వ్యక్తి అని, ఆయన ముందుచూపుతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర విభజన తరువాత ఏపీ అన్నిరంగాల్లో ముందుకు సాగిందని అన్నారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని యనమల విమర్శించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై మీడియా యనమలను ప్రశ్నించగా.. భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి ఈనాడు మన ముందు లేరు.. భవిష్యత్తును నాశనం చేస్తున్న వ్యక్తి అధికారంలో ఉన్నాడని, ఇలాంటి సమయంలో చంద్రబాబు జైలులో ఎలా ఆనందంగా ఉంటారని యనమల అన్నారు. చంద్రబాబు ఉండే గదిలో సరియైన సౌకర్యాలు లేవని, గదిలో ఏసీ ఉంటే బాగుంటుందని డీఐజీకి రిక్వెస్ట్ చేశామని అన్నారు. అయినప్పటికీ.. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తప్ప.. ఆయనకు కల్పించిన సౌకర్యాలు, ఇబ్బందులు గురించి ఆయన ఆలోచించడం లేదని, కానీ, జైలులో చంద్రబాబు ఇబ్బందిని చూసి మేమే ఆయన ఉన్న గదిలో ఏసీ, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరడం జరిగిందని యనమల అన్నారు. తనకు మద్దతు తెలిపిన ప్రజలకు, జాతీయ స్థాయినేతలకు కృతజ్ఙతలు చెప్పాలని చంద్రబాబు అన్నారని యనమల తెలిపారు.
అంతకుముందు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని పూజలు చేశారు. అనంతరం లోకేశ్ క్యాంప్ సైట్ వద్దకు చేరుకొని మధ్యాహ్నం 12గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు.