nara lokesh achen naidu loose weight: కేడర్‌ను ఆకర్షించేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ కొత్త విధానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అంటున్నారు. ఫిట్‌నెస్ మంత్రంతో ఏపీలో ప్రజానీకాన్ని ఆకర్షించాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు. పార్టీని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అష్టకష్టాలు పడుతుంటే ఇతర నాయకులు ఫిట్‌నెస్ మంత్రంతో జనానికి దగ్గరవ్వాలని చూస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో 23 మంది సభ్యులను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. వారిలో నలుగురు అధికార పార్టీకి దగ్గరయ్యారు. మిగిలిన వారిలో ఎంతమంది అటువైపు వెళ్తారో తెలియని పరిస్థితి.
ఒకపక్క నేతలను కాపాడుకుంటూనే మరోపక్క అధికార పార్టీపై పోరాటం:
ఒకపక్క పార్టీ నేతలను కాపాడుకుంటూనే మరోపక్క అధికార పార్టీపై పోరాడుతోంది టీడీపీ. అచ్చెన్నాయుడును ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరితో పని చేయిస్తూ పార్టీని పటిష్ట పరచాలనేది చంద్రబాబు ఆలోచన. ఇప్పటికే నారా లోకేశ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను సందర్శించి, రైతులకు ధైర్యాన్ని నూరిపోశారు లోకేశ్. అలాగే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఓవైపు లోకేశ్, మరోవైపు అచ్చెన్న:
ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్నారు. అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత విజయవాడకు వచ్చి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తన వాదనను గట్టిగా వినిపించారు. ఒకపక్క లోకేశ్, మరోపక్క అచ్చెన్నాయుడు జోడెద్దులులా పని చేసి పార్టీని అధికార పీఠంపై కూర్చోపెట్టే వరకు విశ్రమించకూడదని సీనియర్లు కోరుకుంటున్నారు.
శరీరాకృతిపై లోకేష్, అచ్చెన్న ఫుల్ ఫోకస్:
ఇప్పుడు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్.. తమ శరీరాకృతి పట్ల చాలా జాగ్రత్త వహిస్తున్నారట. ఇన్ని రోజులు తామిద్దరికీ అవరోధంగా ఉన్న శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. ఆరు నెలల క్రితం వరకు హెవీ బాడీతో కనిపించిన లోకేశ్ ఇప్పుడు పూర్తిగా మారిపోవడంతో కేడర్ మంచి జోష్ మీద ఉన్నారని అంటున్నారు. మార్చిలో జరిగిన మహానాడు నాటికే లోకేశ్ బరువు తగ్గినా ఇప్పుడు పూర్తి స్థాయి మార్పు కనిపిస్తోందని సంబరపడిపోతున్నారు. పార్టీలో నేతలంతా లోకేశ్ ఎలా తగ్గారు? ఏం చేస్తున్నారు? అని ఒకటే చర్చించుకుంటున్నారు.
ఏకంగా 25 కిలోలు తగ్గిన చినబాబు:
నైకీ ట్రైనింగ్ క్లబ్ యాప్ ఉపయోగించి వ్యాయామాలు చేసి బరువు తగ్గారని లోకేశ్ సన్నిహితులు చెబుతున్నారు. ఆహార నియమాలు కూడా కచ్చితంగా పాటిస్తూ లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు కూడా అవే నిబంధనలు ఫాలో అవుతూ రోజుకి గంట వ్యాయామం చేస్తున్నారని, కేవలం ఉడకపెట్టిన కూరగాయలు, ఆహార పదార్థాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అందుకే దాదాపు 25 కేజీల వెయిట్ తగ్గారని అంటున్నారు. చాలా మంది టీడీపీ యాత్ ఇప్పుడు లోకేశ్ డైట్‌ను ఫాలో అవుతున్నారని టాక్.
22 కిలోలు తగ్గిన అచ్చెన్న:
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డారట. జైలు నుంచి బయటికి వచ్చేటప్పుడే దాదాపు 12 కేజీల బరువు తగ్గారని అంటున్నారు. అనంతరం పూర్తిస్థాయి కసరత్తులు చేస్తూ కఠోర శ్రమతో మొత్తంగా ఇప్పటికే 22 కేజీల బరువు తగ్గారు. రోజుకి రెండు గంటలు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారట. అచ్చెన్నాయుడి శరీరాకృతి గురించి ప్రత్యర్థి పార్టీలు సైతం అనేక విమర్శలు చేశాయి.
ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని అచ్చెన్న పట్టుదల:
సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ సైతం అచ్చెన్నాయుడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని అనేక సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బరువు తగ్గి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని అచ్చెన్నాయుడు భావిస్తున్నారు. అదే సందర్భంలో కార్యకర్తలకి కూడా కొత్తగా కనిపించాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. వారిని ఆకట్టుకోవాలంటే ఇలాంటి ట్రిక్ చేయాల్సిందేనని కొంతమంది నేతలు అభిప్రాయ పడుతున్నారు.
అచ్చెన్నాయుడు, నారా లోకేశ్ ఇప్పుడు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ, వారితో మమేకమవుతూ పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకే ఫిట్‌నెస్ మంత్రాన్ని జపిస్తున్నారని అంటున్నారు. పార్టీని అధికార పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ఈ స్లిమ్ అండ్ ఫిట్ ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టటమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
https://www.youtube.com/watch?v=3jlBQkt2_K4