రోడ్డుపై కూర్చొన్న బాబు : పోలీసులతో నారా లోకేష్ వాగ్వాదం..ఉద్రిక్త వాతావరణం

  • Published By: madhu ,Published On : January 8, 2020 / 03:04 PM IST
రోడ్డుపై కూర్చొన్న బాబు : పోలీసులతో నారా లోకేష్ వాగ్వాదం..ఉద్రిక్త వాతావరణం

Updated On : January 8, 2020 / 3:04 PM IST

బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆపేసిన బస్సులను వెంటనే రిలీజ్ చేయాలంటూ APIIC కాలనీకి పాదయాత్రగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్ష నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, వెంటనే వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. తాము మాత్రం బస్సులు నిలిపివేసిన ప్రాంతానికి వెళుతామని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం అనుమతినివ్వకపోవడంతో బాబు రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, తెలుగు తమ్ముళ్లు భారీగా చేరుకున్నారు. బాబు దగ్గరకు వెళ్లేందుకు లోకేష్ ప్రయత్నించారు. దీనిని పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఆందోళన చేస్తున్న వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. 
పోలీసులతో బాబు, నారా లోకేష్ వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యాత్రకు అనుమతినివ్వాలని, సీజ్ చేసిన బస్సును వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల చర్యలను నేతలు విమర్శిస్తున్నారు. 

రాజధానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమరావతి ప్రాంతాల వాసులు వ్యతిరేకిస్తున్నారు. 22 రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. దశల వారీగా ఆందోళన చేపడుతున్న వారు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అమరావతి జేఏసీ పరరక్షణ సమితి ఏర్పాటైంది. 13 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టాలని తాజాగా డిసైడ్ అయ్యారు. కానీ యాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. డీజీపీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

 

కానీ రవాణా శాఖ అనుమతి తీసుకున్న తరువాత..మరలా పోలీసుల అవసరం ఏంటీ అని సమితి పేర్కొంటోంది. వీరు నిర్వహించిన బస్సు యాత్రకు టీడీపీ, వామపక్షాలు, ఇతరులు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా బెంజ్ సర్కిల్ వద్ద పాదయాత్రగా వస్తున్న బాబును అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మరి బాబు పాదయాత్రగా ముందుకెళుతారా ? లేక అరెస్టు చేస్తారా ? అనేది కొద్దిసేపట్లో తెలియనుంది. 

Read More : పాడె మోసిన నారా లోకేష్ : 10 మంది రైతులు చనిపోతే స్పందించరా