మీలో ఒక్కడిగా నన్ను భావించి మీకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వండి: నారా లోకేశ్

"డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయండి" అని నారా లోకేశ్ అన్నారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి అయ్యారు. విద్యార్థుల పుస్తకాలను పరిశీలించి వారిని లోకేశ్ పలు ప్రశ్నలు అడిగారు.

“మీలో ఒక్కడిగా నన్ను భావించి మీకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వండి. విద్యార్థులకు ఇది ఎంతో కీలక దశ. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయండి.

ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలి. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థ లో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలి” అని లోకేశ్ సూచించారు.

కాగా, దీనిపై ఎక్స్‌లోనూ నారా లోకేశ్ స్పందించారు. “విద్యార్థుల చిరునవ్వు చూసిన తరువాత సంక్రాంతి ముందే వచ్చినట్టు అనిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తుంది ప్రజా ప్రభుత్వం.

గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్న భోజన పధకాలను ఆపేసింది. నిరుపేద కుటుంబాల పై భారం తగ్గించాలనే ఉద్దేశంతో నేను మంత్రి అయ్యిన వెంటనే డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందజేశాం.

ఈ రోజు 475 ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని ప్రారంభించాం. ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో చదువుతున్న 1.48 లక్షల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడానికి ఏడాదికి రూ.86 కోట్లు ఖర్చు అవుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కృతజ్ఞతలు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నాను. రానున్న కాలంలో ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీలను మరింత అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అని అన్నారు.

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి.. తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు