Nara Lokesh
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేశ్, ఏపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ మట్లాడుతూ.. పార్టీలోని సీనియర్ నేతలకు కీలక సూచనలు చేశారు.
Read Also : అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుంది.. టీడీపీ ఆవిర్భావ వేడుకలో సీఎం చంద్రబాబు
పార్టీలో సంస్కరణలపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్కరణలు నాతోనే మొదలు కావాలి. మూడు సార్లు ఒకే పదవిలో ఉన్న వారు ఆ తరువాతి స్థాయికి వెళ్లాలి.. లేదా బ్రేక్ తీసుకోవాలని లోకేశ్ సూచించారు. నాలుగు సార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నా నుంచే ఈ సంస్కరణ ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నానని అన్నారు. గ్రామస్థాయి నాయకులు రాష్ట్ర నేతలుగా ఎదిగి పొలిట్ బ్యూరోలోకి అడుగు పెట్టాలి. యువతకు రెక్కలు వచ్చి రాజకీయాల్లోకి రావాలని అన్నారు. అయితే, పార్టీలో సీనియర్లు, జూనియర్లకు ప్రాధాన్యం ఉంటుంది. పనిచేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీలో యువరక్తం నింపేందుకు ప్రతిఒక్కరి సహకారం కావాలని లోకేశ్ ఈ సందర్భంగా కోరారు.
రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. నేను ఎక్కడ మాట్లాడుతున్నా రెడ్ బుక్ ప్రస్తావన వస్తుంది. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తుంది.. ఇంకొందరు బాత్ రూమ్ లలో జారిపడుతున్నారంటూ లోకేశ్ అన్నారు. ఇగోలు, అధికార గర్వం పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాజకీయ రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా తెలుగుదేశానికే సాధ్యం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అధినేతలు. ఒప్పు చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు అంటూ పార్టీ కార్యకర్తలపై లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. క్లేమోర్ మైన్లకు భయపడని పార్టీ.. కామెడీ పీసులకు భయపడతుందా..? నలుగురు ఎమ్మెల్యేలను లాగితే ప్రతిపక్షహోదా దక్కదని ప్రగల్భాలు పలికిన వారికి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చేశారు. ప్రజలు కోరుకున్న రాష్ట్రం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని నారా లోకేశ్ అన్నారు.
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చప్పుడై ప్రభజనం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీకి గల్లీ రాజకీయాలు తెలుసు.. ఢిల్లీ రాజకీయాలూ తెలుసని లోకేశ్ అన్నారు. తెలుగుదేశం జెండా పీకుతామన్నవాళ్లంతా అడ్రెస్ లేకుండా పోయారని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా నిలబడ్డ పసుపు సైన్యానికి నారా లోకేశ్ హ్యాట్సాఫ్ చెప్పారు. నామినేషన్ పత్రాలు గుంజుకుంటుంటే తొడగొట్టి మీసం మెలేసిన అంజిరెడ్డి మన ధైర్యం, జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య మన పౌరుషం, కత్తివేటు పడి రక్తం కారుతున్నా పోలింగ్ బూత్ వదలని మంజులారెడ్డి మన దమ్ము అని లోకేశ్ అన్నారు.