అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుంది.. టీడీపీ ఆవిర్భావ వేడుకలో సీఎం చంద్రబాబు
తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలి. పార్టీలో యువరక్తంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేశ్, ఏపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు వారు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని అన్నారు.
తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలి. పార్టీలో యువరక్తంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. పార్టీకి మనమంతా వారసులమే.. పెత్తందారులం కాదు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పాదాభివందనం చేసి సెల్యూట్ కొడుతున్నా. నాకు కాగితాలు ఇస్తే పదవులు రావు.. క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. ప్రతీ కులానికి న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: Vizag Mayor post: విశాఖ పీఠం ఫైట్.. కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా.. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా.. ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా. రైతన్నల కన్నీరు తుడిచి వారి వెన్నంటే ఉన్న జెండా. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్ధం మార్చిన జెండా. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా.. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా.. మన పసుపు జెండా అని చంద్రబాబు అన్నారు.
రాజకీయాల్లో ఎప్పుడూలేని సంస్కృతి గత ఐదేళ్లలో చూశామని, ఆస్తుల విధ్వంసం జరిగినా, రాజకీయ హత్యలు చేసినా, ఆర్థిక మూలాలు దెబ్బతీసినా కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. మంచికి మంచిగా ఉండే మనం.. తప్పుచేసి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఉపేక్షించం. చెడును శిక్షించకపోతే మంచిని కాపాడలేమని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలు హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. కార్యకర్తల్లో హుషారు తగ్గినప్పుడే విపక్షం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఇస్తాం. ప్రజల చుట్టూ తిరిగే కార్యకర్తలకు, కార్యకర్తల చుట్టూ తిరిగే నాయకులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.