Nara Lokesh
Nara Lokesh – TDP: వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వడంపై నారా లోకేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడికి అవినీతి మరక అంటించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని, అందుకే జైల్లో పెట్టిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు జోహో సంస్థ ఛైర్మన్ కూడా ఖండించారని అన్నారు. దొంగ కేసులకు, బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పారు.
సీఎం జగన్ పై ఏడు ఈడీ కేసులు, 21 ఇతర కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. దేశంలోనే కాకుండా ప్రపంచం అంతటా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నాయుడంటే ఓ బ్రాండ్ అని ప్రపంచ ప్రసిద్ధ సంస్థల సీఈవోలు చెబుతారని వ్యాఖ్యానించారు.
అటువంటి వ్యక్తిపై అక్రమంగా కేసు పెట్టి వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపిందని చెప్పారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదని అన్నారు. ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. అక్రమాలు, హత్యలు చేసినవారు బయట తిరుగుతున్నారని, ఏ తప్పు చేయని చంద్రబాబుని జైల్లో పెట్టారని చెప్పారు. రాజకీయాల్లో అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు.
నన్నూ అరెస్టు చేయండి..
తనను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని నారా లోకేశ్ అన్నారు. ఎన్ని రోజులు జైలులో పెట్టాలనుకుంటే అన్ని రోజులు పెట్టుకోవచ్చని చెప్పారు. అయినప్పటికీ ఈ వైసీపీ అంతు చూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.
CM Mamata Banerjee : చంద్రబాబు అరెస్టుపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు