×
Ad

మరోసారి జనం మధ్యకు నారా లోకేశ్.. 11 నుంచి శంఖారావం సభలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు పర్యటించనున్నారు.

Nara Lokesh Shankharavam from febraury 11 in Andhra Pradesh

Nara Lokesh Shankharavam: యువగళం పాదయాత్రను విజయవంతంగా ముగించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేశ్ ప్రణాళికలు వేశారు. ఉత్తరాంధ్ర నుంచి శంఖారావం ప్రారంభం కానుంది. శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాల్లోనూ, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపటమే శంఖారావం లక్ష్యమని, రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం కార్యక్రమానికి లోకేశ్ సారథ్యం వహిస్తారని చెప్పారు.

ప్రతీ రోజూ 3 నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు శంఖారావం పర్యటన సాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11వ తేదీ ఉదయం 9 గంటలకు శంఖారావం తొలిసభ జరుగుతుందన్నారు. జగన్ పాలనలో మోసపోయిన యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం సాగనుందని చెప్పారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే రా.. కదలి రా పేరుతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభలు నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: చంద్రబాబును కలిసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు