Nellore YSRCP Politics : నెల్లూరు వైసీపీలో సీనియర్ల మధ్య ఫైట్.. ఆ యువనేతకు ఎసరు..! అసలేం జరుగుతోంది?

Nellore YSRCP Politics : నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మధ్య ఉన్న విభేధాలు ఓ యువనేతకు హెడెక్‌గా మారాయి.

Nellore YCP Politics

Nellore YSRCP Politics : నెల్లూరు వైసీపీ సీనియర్ నేత మధ్య ఉన్న విభేధాలు ఓ యువనేతకు హెడెక్‌గా మారాయి. నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన ఊటుకూరు నాగార్జున.. ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ నాగార్జునకు మంచి సంబంధాలున్నాయి. సీనియర్ నేతలు.. నియోజకవర్గ ఇంచార్జ్‌ల కంటే బలంగా.. వైసీపీ పార్టీ యాక్టివిటీ, సర్కార్‌పై అటాక్‌ మోడ్‌లో వెళ్తూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. కానీ, ఆయనకు ఇటీవల ఊహించని షాక్ తగిలింది.

Also Read : CM Chandrababu: డీఎస్సీలో అక్రమాలు జరగలేదు.. వైకాపా కుట్రలపై చంద్రబాబు ఫైర్.. అనకాపల్లి వేదికగా సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే వైసీపీ అధిష్టానం యువజన విభాగం జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఊటుకూరు నాగార్జునను తప్పించింది. దీంతో వైసీపీలో తనపై జరుగుతున్న కుట్ర జరుగుతుందంటూ మీడియా ముందుకొచ్చి ఆవేదన వెళ్లగక్కారు నాగార్జున. తాను పార్టీలో ఒక కార్యకర్తగా పని చేస్తానని.. ఏ నాయకుడికి బానిసగా పని చేయనంటున్నారు. వైసీపీ పెద్దలు తనకు కొత్తగా ఆఫర్ చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ పదవిని కూడా తిరస్కరించారు. గతంలోనూ తనను గూడూరు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించి అదే రోజు సాయంత్రానికల్లా ఆ పదవి దక్కకుండా పార్టీలోని కొందరు వైసీపీ నేతలే అడ్డుకున్నారని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నాగార్జున అనుచరుడైనా.. ఆయనిప్పుడు లేకపోవడంతో.. నెల్లూరు సిటీ వైసీపీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తిరుగుతూ కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే అనిల్‌కు చంద్రశేఖర్ రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయట. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ వర్గాన్ని దాదాపు దూరం పెట్టేశారట చంద్రశేఖర్ రెడ్డి. నెక్స్ట్ టార్గెట్ నాగార్జున అన్నట్లుగా వ్యవహరించారట. దీంతో చంద్రశేఖర్‌రెడ్డికి, నాగార్జునకు మధ్య గ్యాప్ వచ్చిందట. నాగార్జున తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించకపోవడంతో.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, నాగార్జున మధ్య దూరం పెరిగి.. అంటీముట్టనట్లుగా ఉంటున్నారట.

మరోవైపు గూడూరు వైసీపీ ఇంచార్జ్‌ మార్పు కూడా పెద్ద దుమారాన్ని రేపింది. మేరిగ మురళిని తప్పించి బూదూరు గురవయ్యను ఇంచార్జ్‌గా నియమించడంతో.. అధిష్టానం నిర్ణయంపై వైసీపీ లీడర్లు, క్యాడర్‌ నుంచి నిరసన వ్యక్తం అయింది. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు కొద్ది రోజుల క్రితం నాగార్జునను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పదవి నుంచి తప్పించి ఆ పదవిని మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తికి అప్పగించారట వైసీపీ పెద్దలు. అదికూడా నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారాయణకు సంబంధించిన స్థలంపై వివాదాన్ని లేవనెత్తిన రోజే నాగార్జున పదవిపోవడం విశేషం.

తనను యువజనం విభాగం జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వెనుక పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందనేది నాగార్జున డౌట్ అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ దగ్గరకు మేరిగ మురళిని తీసుకెళ్లి.. తన పదవి పోవడానికి కారణమవడమే కాకుండా, గూడూరు నియోజకవర్గ పరిశీలకుడు పదవి దక్కకుండా చేయడం వెనుక కూడా చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని నాగార్జున పరోక్షంగా ఆరోపిస్తున్నారు.

ఇక అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని.. త్వరలోనే న్యాయం జరుగుతుందని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారట. దీంతో తన అనుచరుడు నాగార్జున పదవిని కాపాడటంలో అనిల్ కుమార్ యాదవ్ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయట. మొత్తానికి అనిల్ కుమార్‌ యాదవ్‌, చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఉన్న వివాదాలకు బలమైన యువనేతగా ఎదుగుతున్న నాగార్జున బలయ్యాడనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.