Nellore Maithili Incident
Nellore Maithili Incident : నెల్లూరులో బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కలకలం రేపింది. మైథిలి ప్రియ అనే యువతిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హతమార్చాడు. మాట్లాడాలని రూమ్‌కు పిలుపించుకున్న నిఖిల్.. మైథిలిపై దాడి చేశాడు. కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైథిలి ప్రేమకు నిరాకరించడంతోనే నిందితుడు హతమార్చి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Earthquake : వామ్మో.. రష్యాను మరోసారి వణికించిన భారీ భూకంపం.. సునామీ వార్నింగ్
మైథిలి మృతితో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మైథిలి హత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ఒక్కడే మైథిలిని హత్యచేయలేదని, అతడికి మరికొంత మంది సహకరించి ఉంటారని మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. పోలీసులపై తమకు పూర్తినమ్మకం ఉందని, మైథిలి హత్యకు కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మృతురాలి తల్లి మాట్లాడుతూ.. నిఖిల్ అనే వ్యక్తి కాలేజీ సమయంలో మా అమ్మాయిని వేధించాడు. కాలేజీ సమక్షంలో మా కూతురు జోలికి రావొద్దని తాను వేడుకోవటంతో అప్పటి నుంచి మా బిడ్డ జోలికి రాలేదు. కానీ, ఈరోజు నా బిడ్డను పిలిచి హత్య చేశాడు. మైథిలి బెంగళూరులో జాబ్ చేస్తుంది. తన పుట్టిన రోజుకని ఇంటికొచ్చింది. ఆమెను పిలిపించుకొని దారుణానికి పాల్పడ్డారంటూ మృతిరాలి తల్లి బోరున విలపించింది. నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు.. ఆమెపై నిందలు వేయొద్దు.. నాకు న్యాయం చేయండి.. నిందితుడు నిఖిల్‌తో నేను మాట్లాడాలి.. ఏకన్న తల్లికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు అంటూ మృతురాలి తల్లి కన్నీరుమున్నీరైంది.
మైథిలి ప్రియ సోదరి సాహితి మాట్లాడుతూ.. నిఖిల్ మా అక్క క్లాస్‌మెంట్. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. నిన్న నిఖిల్ పిలిస్తే మా అక్క వెళ్లింది. ఈ ఘటన తరువాత మైథిలిని తానే చంపానని నిఖిల్ నాకు ఫోన్లో చెప్పాడు. వెంటనే మేము పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాం. వాళ్లు కూడా చనిపోయిందని చెప్పారు. మా అక్కను నిఖిల్ ఒక్కడే చంపలేదు.. ఈ హత్యలో మరికొందరి ప్రమేయం ఉంది. వారందరినీ కఠినంగా శిక్షించాలి, మా కుటుంబానికి న్యాయం చేయాలని సాహితి డిమాండ్ చేసింది.