Nellore politics: నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నెల్లూరు కార్పొరేషన్‌పై జెండా ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేసిన కూటమి..నెల్లూరు మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు అదేస్థాయిలో పావులు కదుపుతోంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై మరో ఐదు రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
మెజార్టీ నెంబర్ లేకపోయినా టీడీపీకి టెన్షన్ పుట్టిస్తోంది వైసీపీ. అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ అంత ఈజీగా ముగియకూడదంటూ టీడీపీలో చేరిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లను జగన్ సమక్షంలో తిరిగి సొంతగూటికి చేర్చుకుంది. అయితే ఫ్యాన్ పార్టీలో చేరి 24 గంటలు కాకముందే ఆ ఐదుగురిలో ఇద్దరు యూటర్న్ తీసుకొని టీడీపీ గూటికి వచ్చేశారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ. దీంతో నెల్లూరు మేయర్ అవిశ్వాసం ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
సింహపురి రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మేయర్ స్రవంతిపై ఈనెల 18న అవిశ్వాస తీర్మానం జరగనున్న క్రమంలో..వైసీపీ గేమ్ స్టార్ట్ చేసింది. నిన్న మొన్నటి వరకు మేయర్ తమ పార్టీ కాదని..అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదంటూ చెప్పిన వైసీపీ..ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చేలా అడుగులు వేస్తుంది.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఏ పార్టీనో క్లారిటీ వచ్చినట్లేనా?
సిటీ నియోజకవర్గానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు, రూరల్‌కు చెందిన ఓ కార్పొరేటర్ మాజీ సీఎం జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటి వచ్చారు. ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి సొంత గూటికి చేర్చేందుకు..మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పారు.
టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఐదుగురిని జగన్ దగ్గరకు తీసుకెళ్లి.. తిరిగి వైసీపీలో చేర్పించారు. కట్ చేస్తే అందులో ఇద్దరు వెంటనే ప్లేట్ ఫిరాయించారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54కి 54 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది మినహా మిగిలిన కార్పొ రేటర్లంతా టీడీపీలో చేరారు. ఈ క్రమంలో నవంబర్ 24న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి 40 మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.
ఈ నెల 18న మేయర్‌పై అవిశ్వాసం
నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు కూడా అందజేశారు. దీంతో ఈ నెల 18న మేయర్‌పై అవిశ్వాసం కోసం కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ అవిశ్వాసం సాఫీగా జరిగిపోతుందని భావిస్తున్న టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఒక్కసారిగా టెన్షన్ పుట్టించారు.
వీరిద్దరూ టీడీపీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేలా వ్యూహం రచించడంతో కార్పొరేషన్ రాజకీయం హాట్ హాట్‌గా మారింది. 54 మంది కార్పొరేటర్లు ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థలో..డిప్యూటీ మేయర్ ఉన్న ఖలీల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సభ్యుల సంఖ్య 53కు పడిపోయింది. ఇందులో 41 మంది టీడీపీ తరఫున ఉండగా..12 మంది వైసీపీలో ఉన్నారు. అయితే ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరి..అందులో ఇద్దరు తిరిగి సైకిల్ ఎక్కిన తర్వాత..బలబలాలు మారిపోయాయి.
ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా.. వైసీసీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్‌లో ఉన్నారని.. అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి మూడొంతుల్లో రెండు వంతుల మెజార్టీ ఉండాలి. అదే అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి 1/3 ఉండాలి. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి బ్రదర్స్, మంత్రి నారాయణ, రూప్‌కుమార్ యాదవ్‌లు కూడా అలర్ట్ అయ్యారు.
రాత్రికి రాత్రి చక్రం తిప్పి వైసీపీలోకి వెళ్లినవారిలో ఇద్దర్ని తిరిగి టీడీపీలోకి రప్పించగలిగారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీ క్యాంపు పాలిటిక్స్‌కు తెరలేపింది. 35 మందికిపైగా సిటీ, రూరల్ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. అవిశ్వాసం ముందు రోజు వరకు వీళ్లంతా క్యాంపుల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అటు వైసీపీ లీడర్లు..కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని..బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఫిర్యాదులు చేస్తుంది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రంజుగా మారింది. ఈ నెల 18న ఏం జరగబోతోందనేది వేచి చూడాలి.