తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఏ పార్టీనో క్లారిటీ వచ్చినట్లేనా?

సర్పంచ్‌ ఎన్నికలనే లైట్ తీసుకుంటే.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు GHMC, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉంటుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఏ పార్టీనో క్లారిటీ వచ్చినట్లేనా?

Updated On : December 12, 2025 / 8:53 PM IST

BJP: అంత అన్నారు. ఇంత అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా తమదే అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉండి..రాష్ట్రస్థాయిలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, పైగా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నా..పంచాయతీ పోరులో మాత్రం సత్తా చాటడంలో కమలం లెక్కలు తారుమారయ్యాయట. ఫస్ట్ ఫేజ్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో బీజేపీ ఒకటి అనుకుంటే రిజల్ట్ మరోలా వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. మెజారిటీ గ్రామ పంచాయతీల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు అసలు బరిలోనే లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందట.

కొన్ని చోట్ల పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పోటీలో ఉన్నా..పదుల సంఖ్యలోనే ఓట్లు రావడం కూడా చర్చకు దారితీస్తోంది. మరి కొన్నిచోట్ల బీజేపీ సానుభూతిపరులు, కార్యకర్తలు, హిందుత్వవాదుల ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వ లోపంతోనే సర్పంచ్‌ పదవులను గెలుచుకోలేకపోయామని క్యాడర్ మదనపడుతోందట. పల్లెల్లో పార్టీ బలపడేందుకు ఉపయోగపడే వార్డు మెంబర్, సర్పంచ్ ఎన్నికలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంత సీరియస్‌ తీసుకోలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారట.

మామూలుగా అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఫస్ట్ ఫేజ్ సర్పంచ్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్లు స్పష్టం అవుతోంది. అయితే సర్పంచ్‌ ఎన్నికలను బీఆర్ఎస్ లైట్‌ తీసుకున్నప్పటికీ సెకండ్‌ ప్లేస్‌ నిలవడంతో గులాబీ లీడర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.

Also Read: Chandrababu Naidu: పదవులు.. పంపకాలు.. చంద్రబాబుకు సవాల్‌..!?

లోకల్ లీడర్లు, బీఆర్ఎస్‌ క్యాడర్ ఫైట్‌ చేసి గెలిస్తేనే రెండోస్థానంలో నిలిచామని..పార్టీ పరంగా తాము సీరియస్‌గా తీసుకుని..ప్రచారం, అభ్యర్థుల ఎంపిక మిగతా విషయాలన్నింటిపై ఫోకస్ పెడితే..తమకు కూడా అధికార పార్టీతో సమానంగా ఫలితాలు వచ్చేవని లెక్కలు వేసుకుంటోందట కారు పార్టీ. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రజలు తీర్పు ఇచ్చారని కూడా బీఆర్ఎస్ లీడర్లు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఎటొచ్చి బీజేపీ పరిస్థితే గమ్మత్తుగా తయారైందట. కనీసం థర్డ్ ప్లేస్‌లో కూడా నిలవకపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదట.

సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా..
ఇండిపెండెంట్ల కంటే బీజేపీ గెలిచిన స్థానాలు చాలా తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. 8 మంది ఎంపీలు, 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా..మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో..కమలం పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలు రాబట్ట లేకపోయిందట. తమ నియోజకవర్గాల్లో పట్టు కోసమైనా..ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నం చేయలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదో పోటీలో పెట్టామంటే పెట్టాం అన్నట్లుగా పెద్దగా ఫోకస్ చేయలేదట. పార్టీ సానుభూతిపరులే కొన్ని చోట్ల పట్టుబట్టి గెలిచారని..పార్టీ పరంగా, లీడర్ల పరంగా పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహరచన అమలు చేసిందే లేదని క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట.

ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మళ్లీ గెలవడం కష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. సర్పంచ్‌ ఎన్నికలనే లైట్ తీసుకుంటే.. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు GHMC, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉంటుంది. అప్పుడు అధికార కాంగ్రెస్ ఎలాగూ సీరియస్‌గా తీసుకుంటుంది. ఆ పార్టీకి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఇక బీఆర్ఎస్‌కు ఇప్పటికీ క్యాడర్ బలంగా ఉంది.

ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఆ పార్టీ నేతలు కీలకంగా వ్యవహరిస్తుండటంతో..కారు పార్టీ ఎంపీటీస, జడ్పీటీసీ ఎన్నికలపై ధీమాగా ఉందట. ఇక బీజేపీ స్టేట్ చీఫ్‌ రామ్‌చందర్‌రావుకే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అతిపెద్ద సవాల్‌గా మారాయన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అని ప్రూవ్ చేయాలంటే..సెకండ్‌ ప్లేస్‌లో అయినా నిలవకపోతే..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించడం కష్టమన్న భావనలో ఉన్నారట కమలం పార్టీ కార్యకర్తలు.