Sand Politics
Nellore Penna river sand Politics : నెల్లూరులో పెన్నానది ఇసుక తరలింపు రాజకీయ రగడను రాజేసింది. అధికార పక్షం ప్రతిపక్ష నేతల మధ్య మరో రాజకీయ దుమారాన్ని రేపింది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నిన్న అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన నేతలు.. శుక్రవారం నేరుగా నదిలో తవ్వకాల ప్రాంతాలను పరిశీలించారు.
జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం తరలించిన ఇసుక తరలింపులో మంత్రి అనిల్ కుమార్ కోట్లాది రూపాయల దోపిడీ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక తరలింపుల్లో మంత్రి అనిల్ కుమార్ రూ.100 కోట్ల దోపిడీ చేశారని టీడీపీ ఆరోపించింది. ఈక్రమంలో అఖిలపక్ష నేతలు పెన్నానది ఇసుక తరలింపు ప్రాంతంలో పర్యటించింది. ఈపర్యటన కొంత రసాభాసకు దారి తీసింది. అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు..అధికారుల మధ్య వివాదానికి దారి తీసింది.
ఇసుక తవ్వకాలపై మంత్రి అనిల్ కూడా స్పందించారు. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగలేదని జగనన్న ఇళ్ల స్థలాలకు మాత్రమే ఇసుక ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. నా నిజాయితీ నిరూపించుకోవటానికే అఖిల పక్షంతో మాట్లాడటానికి ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే మంత్రి ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. కళ్లముందే ఇసుక అక్రమంగా తరలిస్తున్నా.. మంత్రికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. కానీ టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ కొట్టిపారేసింది. ఇదంటా టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని విమర్శించింది.