ఏపీ లిక్కర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మొన్న చెవిరెడ్డి పీఏలు బాలాజీ, నవీన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు బయటపెట్టారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పంచిన డబ్బంతా.. లిక్కర్ ముడుపులేనని సిట్ చెప్తోంది. బాలాజీ, నవీన్‌లతో పాటు మరికొందరు అనుచరులు, సిబ్బంది ఈ సొమ్మునంతా తరలించారని.. చెవిరెడ్డి ఆదేశాలతో వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ముడుపులను.. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ లీడర్లకు అందించారనేది సిట్ అలిగేషన్.
అసెంబ్లీ ఎన్నికల టైంలో విడతల వారీగా 8 నుంచి 9 కోట్ల చొప్పున దాదాపు 250 కోట్లు తరలించినట్లు గుర్తించామంటోంది సిట్. తాడేపల్లిలోని ప్రొణయ్ ప్రకాశ్ అపార్ట్‌మెంట్ నుంచి 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు ఉన్న బాక్సులు తరలించారని రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు అధికారులు. గతేడాది మార్చి 1 నుంచి మే 9 మధ్య.. 13 సార్లు నగదు ఉన్న బాక్సులు తరలించారట. కాల్ డేటా ఆధారంగా సిట్ సేకరించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో భారీగా నగదును నియోజకవర్గాల్లోని వాలంటీర్లకు అందించారని సిట్ చెబుతోంది. నగదు తరలించేందుకు ఏకంగా తుడా వాహనాన్ని కూడా వాడినట్లు ఆరోపిస్తోంది. అప్పట్లో తుడా చైర్మన్‌గా ఉన్న మోహిత్ రెడ్డి.. పదవిని దుర్వినియోగం చేస్తూ డ్రైవర్‌తో సొమ్ము తరలించారనేది సిట్ ఆరోపణ. ఇలా కీలక విషయాలను ప్రస్తావిస్తూ సిట్ వేసిన రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మరోవైపు లిక్కర్ కేసు ముడుపుల్లో తొలిదశలో రూ.30 కోట్ల వరకు జప్తు చేసేందుకు సిట్ చర్యలు ప్రారంభించింది.
Also Read: రికార్డులు రప్పా రప్పా.. శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేసిన రికార్డ్స్ ఇవే..
విజయవాడ ఏసీబీ కోర్టులో జప్తు పిటిషన్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్టు దగ్గర పట్టుబడ్డ రూ.8.36 కోట్లు, రాజ్ కెసిరెడ్డి ఆధీనంలో కొనసాగిన అదాన్ డిస్టిలరీస్ ఖాతాలోని రూ.16.12 కోట్లు, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఖాతాలోని రూ.5 కోట్లు, ఎంపీ డిస్టిలరీస్ ఖాతాలోని రూ.50 లక్షల జప్తు కోసం కోర్టులో పిటిషన్ వేసేందుకు సిట్ అనుమతి కోరగా ప్రభుత్వం తెలిపింది. కోర్టు అనుమతిస్తే ఈ అక్రమ సొమ్ము ఎటాచ్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు.? ఎక్కడికి చేర్చారు.? ఎలా తరలించారు.? అనే కీలక అంశాలన్నింటినీ సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించారట.
అలిగేషన్స్, అరెస్టులు, నోటీసులు, విచారణలంటూ..కొన్నాళ్లుగా డైలీ ఎపిసోడ్‌గా కొనసాగుతోన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. అసలు సూత్రధారి ఎవరనేదానిపై కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుండగా..ఎక్కడ మొదలైంది..ఎక్కడ ఎండ్ అయింది..అనేదానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారట.
మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో కింగ్ పిన్ ఎవరు?
అయితే ఈ కేసులో ఏ4గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. లిక్కర్ పాలసీ డిజైన్ చేయడంతో పాటు, దాని అమలు, ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో కింగ్ పిన్ అని చెప్తూ వస్తోంది సిట్. అందుకే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ కాకుండా..పకడ్బందీగా ప్లాన్ చేస్తోందట. లిక్కర్ ఫైల్ వ్యవహారమంతా మిథున్‌రెడ్డి దగ్గరే ఆగిపోలేదని..అంతకు మించి పెద్దలే ఇన్వాల్వ్ అయి ఉంటారని అనుమానిస్తున్నారట. లేటెస్ట్‌గా దొరికిన కొన్ని క్లూస్ అటువైపే లింకులను బయటపెట్టినట్లు టాక్.
ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ పేరుతో నాసిరకం మద్యం అమ్మించి, అందిన కాడికి దోచుకున్నారనేది మెయిన్ అలిగేషన్. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డితో పాటు కీలక వ్యక్తులుగా ఆరోపించబడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని అనుచరులు పలువురు అరెస్ట్ అయ్యారు. వాళ్లందరూ ఇచ్చిన స్టేట్‌మెంట్లను బేస్ చేసుకునే మిథున్‌రెడ్డే కీలక సూత్రధారి అనే అంచనాకు వచ్చారట సిట్ అధికారులు.
ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పి ఆయనను కస్టడీకి తీసుకుని విచారించాలనుకుంటున్నారట. అయితే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇంకా జడ్జిమెంట్ రాకపోవడంతో సిట్ అధికారులు కాస్త వెయిటింగ్‌లో ఉన్నారని అంటున్నారు. ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోన్న లిక్కర్ స్కామ్ కేసు..ఫైనల్‌గా ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ అయితే కొనసాగుతోంది. లిక్కర్ కేసులో వాట్‌నెక్ట్స్ అనేది చూడాలి మరి.