Vizianagaram Sai Supriya Case : విజయనగరంలో వివాహిత సాయి సుప్రియ గృహ నిర్బంధం వ్యవహారం మరో మలుపు తిరిగింది. గృహ నిర్బంధంలో ఉన్న సాయి సుప్రియకు విముక్తి లభించగా, వారి పిల్లల విషయం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో వారి స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ రంగంలోకి దిగింది. రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ అప్పారావ్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు వారి ఇంటికి వెళ్లారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు దగ్గరుండి పిల్లలను కోర్టుకు తరలించారు.
చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సుప్రియ ఇంటిని పరిశీలించారు. తల్లి, పిల్లలకు సంబంధం లేని విధంగా ఉందని అధికారులు అన్నారు. పిల్లల సెక్యూరిటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
విజయనగరంలో 14ఏళ్లు భార్యను ఇంట్లోనే బంధించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివాహితను తన పుట్టింటి వారిని కూడా కలవనివ్వలేదు. చీకటి గదికే పరిమితం చేశాడు లాయర్ గోదావరి మధుసూదన్. ఈ దారుణం గురించి చుట్టుపక్కల వారికి తెలిసినా.. అతడు న్యాయవాది కావడంతో ప్రశ్నించడానికి భయపడ్డారు.(Vizianagaram Sai Supriya Case)
Also Read..Husband Locked Wife : భార్యను 11 ఏళ్లుగా ఇంట్లోనే బంధించిన భర్త
వివాహిత తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించడంతో పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని మధుసూన్ ఇంటికి వెళ్లారు. పోలీసులు సెర్చ్ వారెంట్ చూపి ఇంట్లోకి వెళ్లగా.. సాయి సుప్రియను చూసి ఆమె పుట్టింటి వారు షాక్ అయ్యారు. సాయి సుప్రియ బక్క చిక్కి ఉంది. గుర్తు పట్టలేని విధంగా ఉంది. పోలీసులు సాయి సుప్రియను కోర్టులో హాజరుపరిచారు.
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు విజయనగరం పట్టణానికి చెందిన లాయర్ మధుబాబుతో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయవాది మధుబాబు తన తల్లి, తమ్ముడి మాటలు విని కట్టుకున్న భార్యను బయటి ప్రపంచానికి దూరం చేశాడు. ఏకంగా పద్నాలుగేళ్లపాటు చీకటి గదిలో బంధించాడు. ఎప్పుడూ బయటకు తీసుకొచ్చేవాడు కాదు. పిల్లల్ని కూడా తల్లి దగ్గరకు వెళ్లనివ్వడు. తన తల్లితోనే పిల్లల ఆలనా పాలనా చూపించేవాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు 14ఏళ్లు నరకం చూపించాడు.