విశాఖలో వారం రోజులుగా కొత్త కరోనా కేసుల్లేవ్: ఉత్తరాంధ్ర సేఫ్

  • Publish Date - April 15, 2020 / 09:03 AM IST

విశాఖపట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం విశాఖపై ఉంది.. ఎందుకంటే..గత కొన్ని రోజులుగా కేసులు నమోదు కావడం లేదు. 2020, ఏప్రిల్ 06వ తేదీన 6 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 20 కేసులు రికార్డయ్యాయి. అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలాంటి పరిస్థితి వస్తుందోనని విశాఖ ప్రజలు భయం భయంగా గడిపారు.

కానీ సీన్ మారిపోయింది. రోజులు గడుస్తున్నాయి..కానీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. పంపిన శాంపిల్స్ రిపోర్టులన్నీ నెగటివ్ గానే వస్తుండడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి కారణం అధికారులేనని చెప్పవచ్చు. సచివాలయ ఉద్యోగులు, ఆరోగ్య శాఖ, పోలీసు, వాలంటీర్లు..ఇలా ప్రతొక్క శాఖలో ఉన్న వారు సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలారు.

ఉన్నతస్థాయి నుంచి మొదలుకుని…కిందిస్థాయి ఉద్యోగి వరకు ప్రాణాలకు తెగించి పని చేశారు. రెడ్ జోన్లు, జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించారు. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్ డౌన్ ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. విశాఖపట్టణంలోని ప్రధాన కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కూడా పరీక్షలు నిర్వహించారు. 

జిల్లాలో 955 మందికి పరీక్షలు నిర్వహించారు. 925 మందికి నెగటివ్ వచ్చింది. దీంతో అందరిలో ఉన్న టెన్షన్ పూర్తిగా పోయింది. వారం రోజులుగా నమోదు కాని..కొత్త కేసులు 20 మాత్రమే ఉన్నాయి. మరో 10 రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా విశాఖలో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.