Pithapuram TDP Office : పిఠాపురం టీడీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్మకు ఎమ్మెల్సీ రాకపోవటంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో పిఠాపురం టీడీపీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. సంయమనం పాటించాలని కార్యకర్తలకు టీడీపీ నేత వర్మ నచ్చజెప్పారు.
ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులను అర్థం చేసుకున్నానని, రాష్ట్ర స్థాయిలో వివిధ సమీకరణాల ప్రకారం ఎమ్మెల్సీ సీట్లు కేటాయించారని అన్నారు. రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. తమ అధినేత చంద్రబాబు బాటలోనే తామంతా నడుస్తామని వర్మ తెలిపారు.
Also Read : విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి కౌంట్‌డౌన్.. వైసీపీకి మరో షాక్ ఇచ్చేందుకు కూటమి ఇలా స్కెచ్
”చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలకు, నిర్ణయానికి నేను నా కుటుంబం, పిఠాపురం నియోజకవర్గంలోని నా టీడీపీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం. కట్టుబడి ఉంటాం. పార్టీకి అండగా ఉంటాం. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం. పార్టీ కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకోము. వారి కోసం ప్రాణాలిస్తాం. కూటమి నిర్ణయానికి నేను, నా భార్య, నా కొడుకు.. మన నాయకులు, వారి పిల్లలు..కట్టుబడి ఉందాం. అందరం కష్టపడి పని చేద్దాం. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు గౌరవం నిలిపింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ ” అని కార్యకర్తలతో అన్నారు వర్మ.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. తీవ్ర కసరత్తు అనంతరం 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ), కావలి గ్రీష్మ (ఎస్సీ)లకు అవకాశం దక్కింది. 3 ఎమ్మెల్సీ స్థానాలనూ బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించారు చంద్రబాబు. కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మళ్లీ ఎమ్మెల్సీగా చోటు దక్కింది. ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా బీజేపీ, జనసేనకు చెరో సీటు దక్కింది.
Also Read : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఖరారు..
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మకు ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. పిఠాపురం టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈసారి ఆయనకు అవకాశం దక్కలేదు. దాంతో పిఠాపురం టీడీపీ శ్రేణులు, వర్మ అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా.. 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తామని ఆశావహులకు చంద్రబాబు సర్ది చెప్పినట్టు సమాచారం.