ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసులు మరింత స్వేఛ్ఛనిచ్చారు. లాక్ డౌన్ 4 వదశ మినహాయింపుల్లో భాగంగా రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. అలాగే తమ వాహనాల్ని కూడా తీసుకెళ్లవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లాలంటే పోలీసులు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతాయని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగవచ్చని డీజీపీ తెలిపారు.
తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్న.. ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది.లాక్‌డౌన్ ఆంక్షలు కేవలం కంటైన్మెంట్ జోన్‌లకే పరిమితం చేసిన కారణంగా డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read: ఏపీలో 24 గంటల్లో 47 కొత్త కరోనా కేసులు