మూడు కాదు ఒక్కటే, దేశంలోనే నెంబర్ 1 చేస్తా- ఏపీ రాజధానిపై తేల్చి చెప్పిన చంద్రబాబు

ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.

Chandrababu On Ap Capital : నవ్యాంధ్రకు రాజధాని అమరావతే అని మరోసారి కుండబద్దలు కొట్టారు చంద్రబాబు. గత పాలకులు ఏపీకి రాజధానే లేకుండా చేశారని, విశాఖను రాజధాని చేస్తామన్నా.. అక్కడి ప్రజలు వాళ్లని నమ్మలేదని విమర్శించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, తన పాలనలో విశాఖకు తగిన గుర్తింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు.

ఇలా ఓటేయడం ఎప్పుడూ చూడలేదు..
ఏపీలో పెండింగ్ ఇష్యూస్‌పై.. తన విజన్‌ను ప్రకటించేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని.. ప్రజల బాగుకోసమే వాడుకుంటామని, తాము తీసుకునే ప్రతి నిర్ణయం జనం కోసమే ఉంటుందంటున్నారు. ఏపీ ఓటర్లు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని..ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు ఈసారి స్ఫూర్తి నింపారని కొనియాడారు చంద్రబాబు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో కూలి పనులు చేసుకునే పేదల నుంచి విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సొంత ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి ఓటేయడం తానెప్పుడూ చూడలేదన్నారు.

అమరావతే రాజధాని, విశాఖ అంటే అభిమానం..
ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు. గత పాలకుల హయాంలో ఏపీ రాజధాని ఏంటో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారన్నారు. మూడు రాజధానుల ముచ్చటే ఉండదని తేల్చి చెప్పారు. గత పాలకులు రాజధాని లేకుండా చేశారన్న చంద్రబాబు.. విశాఖను రాజధాని చేస్తామన్నా ఎవరూ నమ్మలేదన్నారు. కూటమి అభ్యర్థులను 70 నుంచి 90 వేల ఓట్లతో గెలిపించారని కొనియాడారు. విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానన్నారు. విశాఖపట్నం అంటే తనకెంతో అభిమానమని చెప్పారు చంద్రబాబు. మూడు పార్టీలకు విశాఖ ప్రజలు పట్టం కట్టారన్నారు చంద్రబాబు. తన పాలనలో విశాఖకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

రాయలసీమ వాసులు తిరగబడ్డారు..
మూడు రాజధానులంటూ.. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామన్నా అక్కడి వాసులకు ఒరిగిందేమీ లేదన్నారు చంద్రబాబు. పాలకుల మోసాన్ని గమనించిన రాయలసీమ వాసులు తిరుగుబాటు చేశారని, చరిత్రలో చూడని విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలకు జిల్లాలే కూటమికి పట్టం కట్టాయన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న చంద్రబాబు.. అయినా, తన అనుభవంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని భరోసా వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం..
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర పెద్దలు చెప్పారని తెలిపారు. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశామని.. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తామని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

ఆ శాఖల నుంచి నిధులు రాబట్టుకోవడం చాలా ముఖ్యం..
ప్రమాణస్వీకారానికి ముందు చంద్రబాబు కామెంట్స్ ఎలా ఉన్నా.. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాలను గుర్తు చేస్తున్నారు నిపుణులు. మూడు కేంద్రమంత్రి పదవులు దక్కించుకోవడమే కాదు.. ఆ శాఖల నుంచి నిధులు రాబట్టుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. కొత్తగా ఎన్ని ఇళ్లు తీసుకొస్తారనే దానితో పాటు గ్రాంట్లు, కేంద్రం నుంచి ఫండింగ్ తీసుకొస్తే ఏపీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఉద్యోగ కల్పన ప్రధాన అంశం..
రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కూడా ప్రధాన అంశమంటున్నారు నిపుణులు. అవకాశాలను అంది పుచ్చుకుని రాష్ట్రాభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలని.. రాజస్థాన్ ప్రభుత్వం లాగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. వాటన్నింటినీ అమలు చేసే అంశంపై చంద్రబాబు సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.

Also Read : ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? లక్ష్య సాధనకు చేయాల్సింది ఏంటి?